పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాక్లెట్‌ని ఇష్టపడని వాళ్లుండరు. ఇతనికి కూడా చాక్లెట్ అంటే మస్త్ ఇష్టం. కానీ, అందరిలా చాక్లెట్లని గబగబా తినేయడు. వాటితో పక్షులు, జంతువుల బొమ్మలు చేస్తాడు. అవి అచ్చం నిజమైన వాటి లెక్కనే ఉంటాయి. ఈమధ్యే చాక్లెట్‌తో జిరాఫీ బొమ్మ తయారుచేసి శెభాష్ అనిపించుకున్నాడు. అతను చేసిన పెద్ద నత్త, పుట్టగొడుగు బొమ్మల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేస్ట్రీ చెఫ్ అయిన ఇతని పేరు అమౌరీ గిచొన్.
అమౌరీ ఫ్రాన్స్‌లో పుట్టాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో 14 ఏండ్లకే స్కూల్ మానేశాడు. కొత్త రకం వంటలు చేయడం, ఫుడ్‌ని అందంగా డెకరేట్ చేయడం మీద ఇష్టం పెంచుకున్నాడు. తల్లిదండ్రులు కూడా అతడి ఇష్టాన్ని కాదనలేదు. దాంతో, కలినరీ ఆర్ట్‌లో రెండేండ్ల కోర్సు చేశాడు. తర్వాత వుల్ఫ్స్ బర్గ్ కాలేజీలో రెండేండ్లు పేస్ట్రీ కోర్స్‌లో చేరాడు. ఆ వెంటనే ఒక బేకరీలో కేక్, పేస్ట్రీ డెకరేటర్‌గా జాబ్ వచ్చింది. పదిహేనేండ్లు పలు బేకరీల్లో కేక్, పేస్ట్రీ డెకరేటర్‌గా పని చేశాడు. ఫ్రాన్స్‌లోనే కాదు అమెరికాలో కూడా పాపులర్ పేస్ట్రీ చెఫ్‌గా పేరు తెచ్చుకున్నాడు అమౌరీ. ఫ్రాన్స్‌లో ‘వు విల్ బి ది నెక్స్ట్ గ్రేట్ పేస్ట్రీ చెఫ్’ అనే టీవీ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి, మూడో ప్లేస్‌లో నిలిచాడు.
మోటార్ బైక్ వీడియోతో..
మూడేండ్ల క్రితం అమెరికాలోని లాస్‌వెగాస్‌లో సొంతంగా కేక్, పేస్ట్రీ షాపు పెట్టాడు అమౌరీ. ఆ షాప్ పేరు ‘ది పేస్ట్రీ అకాడమీ’. అప్పటినుంచి కేక్‌ల డెకరేషన్తో పాటు చాక్లెట్లతో జంతువులు, పక్షులు, రకరకాల బొమ్మలు తయారుచేయాలనుకున్నాడు. మొదట చాక్లెట్‌తో మోటార్‌బైక్ చేశాడు. ఆ వీడియో ని యూట్యూబ్‌లో చాలామంది చూశారు. అప్పటి నుంచి ఏ బొమ్మ చేసినా దాని ఫొటోలు, తయారీ వీడియో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం మొదలుపెట్టాడు అమౌరి. అతను చాక్లెట్‌తో అచ్చు గుద్దినట్టు తయారుచేసిన డ్రాగన్స్, మోటార్‌బైక్, ఏనుగు, ఫేమస్ స్టాచ్యూస్ బొమ్మల్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈమధ్య 8 అడుగుల ఎత్తున్న జిరాఫీ బొమ్మతో పాటు నత్త, పుట్టగొడుగు బొమ్మలు చేసి మరోసారి తన టాలెంట్‌ని చాటుకున్నాడు అమౌరి.
కుకింగ్ క్లాస్‌లు చెప్తుండు
అమౌరీ చెఫ్ మాత్రమే కాదు ఇన్ఫ్లుయెన్సర్, ఎంట్రప్రెనూర్, యూట్యూబర్ కూడా. 2003లో యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. వంట, బేకింగ్, కేక్ డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకు పదివారాల కుకింగ్ క్లాసులు చెప్తున్నాడు. తనకు తెలిసిన
చాక్లెట్ ఆర్ట్‌ని కూడా నేర్పిస్తున్నాడు. కలినరీ ఆర్ట్ గురించి మరింత తెలుసుకునేందుకు మూడేండ్లు ప్రపంచం మొత్తం తిరిగాడు. కొత్త రుచుల గురించి అందరికీ చెప్పాలని ‘ది ఆర్ట్ ఆఫ్ ఫ్లేవర్’ అనే పుస్తకం కూడా రాశాడు. ఇతనికి సోషల్ మీడియాలో దాదాపు 60 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.