రాజన్న సిరిసిల, వెలుగు: జిల్లాలో 13 మండలాలు, 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో వేములవాడ, రుద్రంగి, ఇల్లంతకుంట, బోయిన్ పల్లి ఏఎంసీలు కొలువు దీరగా సిరిసిల్ల నియోజకవర్గంలోని నాలుగు ఏఎంసీలకు ఇంకా కాలేదు. గత డెసెంబర్ లో పాత ఏఎంసీల పదవీ కాలం ముగిసింది. మంత్రి కేటీఆర్ ఇలాఖాలో చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఏఎంసీలను నియామకం చేస్తారన్న సమాచారంతో వాటిని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్తున్నారు. భారీగా ఆశావహులు ఉండడంతో ఏఎంసీ అధ్యక్ష పదవికి పోటీ నెలకొంది.
కొండూరి వర్సెస్ ఆగయ్య..
నాలుగు చైర్మన్ పదవులు తమ అనుచరులకే కట్టబెట్టేందుకు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రయత్నిస్తున్నట్లు సమా చారం. జిల్లాలో ఆగయ్య, కొండూరి వర్గాలు పద వులు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. దీంతో ఇద్దరు మంత్రి వద్దకు వెళ్లి తమ అనుచరులకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొండూరి వర్సెస్ తోట ఆగయ్య అన్న చందంగా పరిస్థితి తయారైంది.
సెస్ పోటీ నుంచి తప్పించారు..
సిరిసిల్ల ఏఎంసీ పదవులకు డిమాండ్ బాగా ఉంది. తమకు డైరెక్టర్ పదవులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కు, పలువురు బీఆర్ఎస్ లీడర్లకు అర్జీలు పెట్టుకుంటున్నారు. పార్టీ కోసం తాము కష్టపడిన తీరును వివరిస్తున్నారు. మార్కెట్ కమిటీ పదవులు హామీ ఇవ్వడంవల్ల దొంతినేని చందర్ రావు, భైరి రమేశ్సెస్ ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఏఎంసీ చైర్మన్ ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. తంగళ్లపల్లి ఏఎంసీ పదవిని సరస్వతమ్మ ఆశిస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు. ఎంపీపీగా పని చేశాక పదేండ్లుగా ఏఎంసీ పదవిని కేటీఆర్ ను అడుగుతున్నారు.
ముస్తాబాద్ లో ముగ్గురి పోటీ..
ముస్తాబాద్ ఏఎంసీ పదవికి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఏఎంసీ పదవికి ఓసీ జనరల్ కు కేటాయించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూంపల్లి సురేందర్ రావు, గతంలో కాంగ్రెస్ లో ఉండి ఏఎంసీ చైర్మన్ గా పని చేసిన చిట్నేని అంజన్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రాల రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చిట్నేని అంజన్ రావు కొండూరి వర్గం కాగా ఆయ నకే పదవి దక్కేలా ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రి ఆశీస్సులెవరికిదక్కుతాయో వేచి చూడాలి.
గంభీరావుపేట లో ఆరుగురు..
గంభీరావుపేట మండలం లోని ఏఎంసీ చైర్మన్ పదవి కోసం ఆరుగురు యత్నిస్తున్నారు. ప్రస్తుతం చైర్మన్ జనరల్ కు రిజర్వు కావడంతోఆశావహుల సంఖ్య పెరిగింది. బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గాంధాడెపు రాజు గతంలో జేఏసీ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. కొండూరి అనుచరునిగా రాజుకే ఏఎంసీ పదవి దక్కుతుందంటున్నారు. మాజీ ఎంపీటీసీలు లింగం యాదవ్ , కమలాకర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన నేత గడ్డమీద శ్రీకాంత్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు లక్కిరెడ్డి లతారెడ్డి, అభిలాష్ , రైతుబంధు కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న బాలకిషన్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎల్లారెడ్డిపేటలో నలుగురు..
ఎల్లారెడ్డిపేట మండలంలో ని బొప్పాపూర్ ఏఎంసీ చైర్మన్ గిరి కోసం ఆశావహులు కేటీఆర్ వద్దకు క్యూ కడుతున్నారు. ఇటీవలి చైర్మన్ కొండా రమేష్, మాజీ ఎంపీపీ మోహన్ కుమార్, నర్సింహారెడ్డి, పులి రమేష్ ప్రయత్నిస్తున్నారు. పులి రమేష్, మోహన్ కేటీఆర్ ను కలిసి అభ్యర్థనను తెలిపారు. కొండూరి కొండా రమేష్ కు, ఆగయ్య మోహన్ కు లేదా పులి రమేష్ కు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాలుగింటికి కేటీఆర్ ఎవ్వరికి ఇస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.