అమరావతి: తెలంగాణలో పనిచేసిన నలుగురు ఐఏఎస్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి గురువారం(అక్టోబర్ 17, 2024) నాడు వెళ్లారు. ఐఏఎస్ ఆమ్రపాలితో పాటు మరో ముగ్గురు ఐఏఎస్లు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. త్వరలో ఈ ఐఏఎస్లకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇవ్వనుంది. ఏపీకి వెళ్లాల్సిందేనని డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు హైకోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే.
తమను రిలీవ్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఐఏఎస్లు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు బుధవారం కొట్టివేసింది. ఐఏఎస్లు వారికి కేటాయించిన స్థానాల్లో చేరాల్సిందేనని, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) జారీ చేసిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నది.
ALSO READ | ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!
ఆలిండియా సర్వీసు ఉద్యోగుల కేటాయింపు అన్నది పరిపాలనా పరమైన నిర్ణయమని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని పేర్కొంది. అధికారులు వినతులను పరిశీలించిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకున్నదని తెలిపింది. మార్గదర్శకాలకు, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిగాయన్న వ్యక్తిగత వివాదాలకు చెందిన పిటిషన్లు ప్రస్తుతం క్యాట్‌లో ఉన్నాయని, ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడ చెప్పవచ్చంటూ పిటిషన్లను కొట్టివేసింది.
దీంతో ఈ ఐఏఎస్లందరూ ఏపీకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఐఏఎస్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ కేడర్కు చెందినఆమ్రపాలిని రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె స్థానంలో ట్రాన్స్పోర్టు కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.