- నత్తకు నడక నేర్పుతున్న బ్యూటిఫికేషన్ పనులు..!
- జనగామ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పనుల్లో నిర్లక్ష్యం
- అధికారుల పర్యవేక్షణ కరువు
జనగామ, వెలుగు: జనగామ రైల్వే స్టేషన్ లో చేపట్టిన అమృత్ భారత్ పథకం డెవలప్ మెంట్ వర్క్స్ ముందుకు సాగడం లేదు. యేడాది కింద ఇదే నెల 6న ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిన ప్రారంభించిన ఈ పనులు నేటికీ స్పీడందుకోవడం లేదు. పనులను ప్రారంభించి వదిలేయడంతో బ్యూటిఫికేషన్ సంగతి అటుంచితే స్టేషన్ కు వచ్చి పోయే ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది.
పనులు డెడ్ స్లో..
సౌత్సెంట్రల్రైల్వేలో జనగామ స్టేషన్ను గతేడాది కేంద్ర సర్కారు అమృత్భారత్రైల్వే స్టేషన్పథకానికి ఎంపిక చేసింది. ప్రయాణికులకు కోసం సౌకర్యాలను కల్పిస్తూ, సుందరీకరించి, స్టేషన్రూపురేఖలు మార్చేలా నిర్ణయించింది. దీంతో స్టేషన్ స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని ఇక్కడి జనాలు భావించారు. కొన్ని నెలల క్రితం ప్లాట్ ఫాంలపై అదనపు షెడ్ల నిర్మాణం, అదనపు బిల్డింగ్ నిర్మాణంతోపాటు రైల్వే స్టేషన్ ముందు భాగంలో గార్డెనింగ్ పనులను మొదలు పెట్టారు. ఇటీవల ఆ పనులు నిలిచిపోయాయి. స్థానిక రైల్వే స్టేషన్ ఆఫీసర్లను అడిగినా వర్క్స్ గురించి తమకు ఏమీ తెలియదని చెబుతున్నారు.
పునాదులకే యేడాది..
జనగామ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పనులు రూ.24.45 కోట్లతో చేపడుతున్నారు. కొన్ని నెలల క్రితం మొదలు పెట్టిన గార్డెనింగ్, సీసీ పనులు, ప్లాట్ ఫాంలపై షెడ్లు, అదనపు గదుల నిర్మాణం వంటివి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. పునాది దాటేందుకే యేడాది పడితే మిగిలిన పనులకు ఇంకా ఎంతకాలం పడుతుందోనని పలువురు నిట్టూర్పు తీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సదరు పనుల్లో నాణ్యత లోపించింది.
అమ్మబావి సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ఇప్పుడున్న బుకింగ్ కౌంటర్ ను మార్చి మరొకచోట నిర్మాణం, కొత్తగా స్టేషన్ మేనేజర్ ఆఫీస్, వెయిటింగ్ హాల్, మోడ్రన్టాయిలెట్స్, ప్రయాణికులు కూర్చునే చైర్స్, స్టేషన్ బయట గ్రౌండ్ లో బ్యూటిఫికేషన్, ఇప్పుడున్న ప్రధాన ద్వారంతోపాటు మరో ద్వారం ఏర్పాటు వంటి పనులు జరుగాల్సి ఉంది. ఇవన్నీ పూర్తైతే రెండో ప్లాట్ ఫాం డెవలప్ మెంట్ వర్క్స్ స్టార్ట్ కావాల్సి ఉన్నది.
పనులు త్వరగా పూర్తి చెయ్యాలె..
జనగామ రైల్వే స్టేషన్ డెవలప్ మెంట్ పనులు త్వరగా పూర్తి చెయ్యాలె. స్టేషన్ ఆవరణలో స్లోగా పనులు జరుగుతుండడం ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. యేడాది క్రితం మొదలు పెట్టిన పనులు ఇప్పటికైనా పూర్తయ్యేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలె.
పొన్నం భాస్కర్ గౌడ్, జనగామ
ఆఫీసర్లు దృష్టి సారించాలి...
రైల్వే స్టేషన్ వల్ల జనగామ రెండు భాగాలుగా విడిపోయింది. అమ్మబావి సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తైతే సౌకర్యంగా ఉంటుంది. ఈ పనులు త్వరగా పూర్తి చేసేలా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
చెరుకు మల్లేశ్, జనగామ