Amrutha Pranay: ద వెయిట్ ఈజ్ ఓవర్.. కోర్టు తీర్పుపై అమృత ఎమోషనల్ పోస్ట్

Amrutha Pranay: ద వెయిట్ ఈజ్ ఓవర్..  కోర్టు తీర్పుపై అమృత ఎమోషనల్ పోస్ట్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్షలు కరారు చేస్తూ ఇచ్చిన కోర్టు తీర్పుపై అమృత ప్రణయ్ స్పందించింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రణయ్ తండ్రి, కుటుంబ సభ్యులతో పాటు పోలీసు అధికారులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు స్పందించారు. ఈ తీర్పు కులోన్మాద పరువు హత్యలు చేసే వారికి గుణపాఠం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఈ కేసులో ప్రధాన బాధితురాలు, ప్రణయ్ హత్యతో తీవ్రంగా నష్టపోయిన అమృత ఎక్కడంటూ ఆమె స్పందన గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న క్రమంలో.. మంగళవారం (మార్చి 12) అమృత స్పందించింది. 

ద వెయిట్ ఈజ్ ఓవర్.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఎట్టకేలకు అమృత స్పందించింది. తన మద్ధతు దారులకు ధన్యవాదాలు చెపుతూ.. ‘‘ద వెయిట్ ఈజ్ ఓవర్.. చివరికి న్యాయం జరిగింది. పరువు పేరున జరిగే ఇలాంటి దారుణ ఘటనలను ఈ తీర్పు తగ్గిస్తుందని భావిస్తున్నాను’’ అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

అదే విధంగా పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది అమృత. ‘‘ఈ పోరాటంలో తమకు మద్ధతుగా నిలిచిన పోలీసు అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అంటూ పేర్కొంది.

‘‘నా కొడుకు పెరుగుతున్నాడు. నా మెంటల్ హెల్త్, నా కొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీడియా ముందుకు రాలేకపోతున్నా. ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నా. మా భద్రతను దృష్టిలో ఉంచుకుని మా మద్ధతు దారులు, వెల్ విషర్స్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’’ అని పోస్ట్ చేసింది. అదే విధంగా రెస్ట్ ఇన్ పీస్ అంటూ ప్రణయ్ కు నివాళులు అర్పిస్తూ ఇన్స్టా పోస్ట్ పెట్టింది అమృత. 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు సోమవారం (మార్చి 10) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు చనిపోవటంతో.. ఏ2గా ఉన్న  సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. మొత్తం ఎనిమిది మందిని దోషులుగా నిర్థారించిన కోర్టు.. సుభాష్ శర్మకు మరణ శిక్షతో విధించగా.. మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంగానే ప్రణయ్ ను హత్య చేసినట్లు నిర్థారించింది కోర్టు. అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చి.. ప్రణయ్ ను హత్య చేయించినట్లు కోర్టు స్పష్టం చేసింది.