
చేర్యాల, వెలుగు: కాంగ్రెస్లీడర్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అక్రమాలకు తెరలేపుతున్నారని సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని, చేర్యాల ప్రాంత సమస్యల పరిష్కారంపై ఫోకస్పెట్టాలని సూచించారు. బుధవారం చేర్యాలలోని సీపీఎం ఆఫీసులో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. చేర్యాల పరిధి సర్వే నంబర్984లోని ప్రతాప్‌రెడ్డికి చెందిన 12.25 గుంటల భూమిని దేవాదుల కెనాల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని పరిహారం చెల్లించిందని గుర్తుచేశారు.
అయితే ప్రతాప్‌రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి సదరు భూమిని తిరిగి ఆక్రమించారని, ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వేసుకుని.. ఇల్లు కట్టుకున్నారని ఆరోపించారు. చేర్యాల పెద్ద చెరువు స్థలం కబ్జా విషయంలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కూతురు తుల్జాభవానిరెడ్డి, జితేందర్‌రెడ్డి, మారుతి ప్రసాద్ తో ఎన్నికలకు ముందు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక, ప్రతాప్‌రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చేర్యాల ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసి, తప్పుడు పద్ధతిలో గెలవాలని చూసిన ప్రతాప్‌రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు నామినేటెడ్పదవులను అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం నాయకులు వెంకట మావో, ఆలేటి యాదగిరి, కృష్ణారెడ్డి, రవికుమార్, అరుణ్‌కుమార్, పి.శ్రీహరి, శోభ, ప్రభాకర్, శ్రీనివాస్, రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.