దేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు ఊరట కల్పించేలా పాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం మూడు రకాల పాల ధరలను తగ్గిస్తున్నట్లు అమూల్ తెలిపింది. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ రకాల పాలపై లీటర్కు రూ.1 తగ్గిస్తున్నట్లు అమూల్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమూల్ గోల్డ్ మిల్కీ లీటర్ ధర రూ.66 ఉండగా.. ఇకపై 65లకే లభించనుంది.
అలాగే.. లీటర్ రూ.54 ధర ఉన్న అమూల్ తాజా పాల ధర రూ.53కు తగ్గింది. అమూల్ టీ స్పెషల్ పాల ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.62 ఉండగా.. కంపెనీ తగ్గింపు నిర్ణయంతో ఇకపై రూ.61కు లభించనుంది. 2025, జనవరి 25వ తేదీ నుండి ఈ సవరింపు ధరలు అమల్లోకి వస్తాయని అమూల్ పేర్కొంది. అమూల్ పాల ధరల తగ్గింపుపై సంస్థ గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా స్పందించారు.
ALSO READ | ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ.. ఎక్కడంటే..
ఆయన మాట్లాడుతూ.. మా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధరలు తగ్గించిన నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదని.. మా ఉత్పత్తుల అధిక నాణ్యతను అలాగే కొనసాగిస్తామన్నారు. ధరల తగ్గింపు మా వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. అమూల్ పాల ధరల తగ్గింపు ఆ సంస్థ మిల్క్ వాడేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.