బోధన్ ఎమ్మెల్యే షకీల్ వాహనం ఢీకొని బాలుడు మృతి

బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ వాహనం ఢీ కొని 11 ఏళ్ల బాలుడు చనిపోయాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. 

అసలేం జరిగింది..? 

బోధన్ కి చెందిన దీపక్ తేజను బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ కి తీవ్ర గాయాలు అయ్యాయని గుర్తించిన వైద్యులు.. వెంటిలేటర్ పై బాలునికి చికిత్స అందించడం ప్రారంభించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ల వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే వాహనంలో ఆయన భార్య ప్రయాణిస్తున్నట్లు కొంతమంది స్థానికులు తెలిపారు. 

బాలుడు దీపక్ తేజ మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తమ కొడుకు మృతికి కారణమైన ఎమ్మెల్యే అనుచరులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

అంతకుముందు.. ప్రమాదానికి గురైన దీపక్ తేజను నిజామాబాద్ కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కేసులు కాకుండా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.