టీచర్‌‌గా మారిన 11 ఏళ్ల బాలిక

ప్యాండెమిక్​ వల్ల దేశవ్యాప్తంగా పిల్లలు ఇంటిదగ్గరే ఉండాల్సిన పరిస్థితి. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా కొన్ని చోట్లే జరుగుతున్నాయి. పైగా అందరికీ ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్లు లేని కారణంగా చాలామంది వాటికి దూరంగా ఉంటున్నారు. ఇలా ఇంటిదగ్గరే ఉంటున్న పిల్లలకు చదువు చెప్పేందుకు ముందుకొచ్చింది పదకొండేళ్ల అమ్మాయి. పేరు దీపికా మింజ్‌. ఝార్ఖండ్‌లోని చందపార అనే చిన్న ఊళ్లో ఉంటున్న దీపిక అక్కడే ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో ఏడో క్లాస్​ చదువుతోంది.

చదువులో ఫస్ట్‌ ఉండే దీపిక.. లాక్‌డౌన్‌లో అందరిలా ఇంటి దగ్గర ఆడుకోకుండా, తోటి పిల్లలకు చదువు చెప్పడం స్టార్ట్‌ చేసింది. తనకంటే చిన్న క్లాసులు చదివే పిల్లలకు ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ చెప్తోంది. ఒక పక్క చదువుకుంటూనే, రోజులో కొంత టైమ్‌ పిల్లలకు చదువు చెప్పేందుకు కేటాయిస్తోంది. అలా చిన్న పిల్లలకు టీచర్‌‌గా మారింది దీపిక.అయితే, దీపిక చేసిన ఈ ప్రయత్నం ఊరినే కదిలించింది. తనకంటే చిన్నవాళ్లకు దీపిక చదువు చెప్తోంది సరే! మరి తనకెవరు చదువు చెప్పాలి? ఊళ్లో తనకంటే పెద్దక్లాస్ వాళ్ల సంగతేంటి? దీనిపై గ్రామసభలో మాట్లాడి, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. 
పదో క్లాసు వరకు చదివే పిల్లలకు ఊళ్లో చదువు చెప్పించాలని నిర్ణయించుకున్నారు. అలా దీపికతో పాటు దాదాపు మరో వంద మంది పిల్లలకు ఇప్పుడు ప్రైవేట్‌ క్లాస్‌లు అందుతున్నాయి. పిల్లల్ని గ్రూప్‌లుగా విడదీసి పాఠాలు చెప్పిస్తున్నారు. ఆన్‌లైన్‌ క్లాసెస్‌ అందుబాటులో లేని ఆ ఊళ్లో ఇప్పుడు దీపిక వల్ల అందరూ పాఠాలు నేర్చుకుంటున్నారు. దీపిక చేస్తున్న సేవ చూసి  ఎంతో సంతోషంగా ఉందని ఆమె తండ్రి చెప్తున్నాడు. భవిష్యత్‌లో ఐఏఎస్‌ కావాలనుకుంటున్నట్లు దీపిక చెప్పింది.