ఛత్తీస్‌ఘర్‌లో దారుణం జరిగింది. జాష్‌పూర్ జిల్లాకు చెందిన ఓ 18 ఏళ్ల యువతిని ఏడు నెలల్లో ఏడుసార్లు అమ్మకానికి పెట్టారు. ఏడుసార్లు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వివిధ ధరలకు కొనుగోలు చేశారు. ఆ బాధలన్నీ భరించలేని యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. జాష్‌పూర్‌కు చెందిన యువతి.. వ్యవసాయ పనుల్లో తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ఊళ్లోనే ఉండేది. అయితే ఆమె బంధువులైన పంచమ్ సింగ్ రాయ్ మరియు అతని భార్య.. ఏదైనా పని ఇప్పిస్తానని చెప్పి యువతిని మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మీ కూతురు మీకు కావాలంటే తాము అడిగిన డబ్బు చెల్లించాలని బెదిరించారు.
యువతి తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోవడంతో ఆమెను ఛతర్‌పూర్ స్థానికుడైన కల్లు రాయ్‌క్వార్‌కు రూ. 20,000కు అమ్మారు. అక్కడి నుంచి యువతిని పలువురు కొనుగోలు చేశారు. చివరిగా ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన సంతోష్ కుష్వా రూ. 70,000 చెల్లించి యువతిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత యువతిని మానసిక వికలాంగుడైన తన కొడుకు బబ్లూ కుష్వాతో బలవంతంగా పెళ్లి చేశాడు. పెళ్లి ఇష్టంలేని యువతి.. గత సెప్టెంబర్‌లో సూసైడ్ చేసుకొని చనిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఛత్తర్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి.. యువతిని మొదటిసారిగా తీసుకెళ్లిన పంచమ్ సింగ్, అతని భార్యను అరెస్ట్ చేశారు. వారితో మొదలుపెట్టి యువతిని కొన్న మిగతా ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు. యువతిని బలవంతంగా పెళ్లి చేసుకున్న బాబ్లూ కుష్వా ఇంకా పరారీలోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు. మిగతావారిలో ఛత్తీస్‌ఘర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువతి ఏడు నెలల్లో ఏడుసార్లు అమ్మకానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మానవ అక్రమరవాణా వ్యవహారం బయటపడింది. ఛత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలకు చెందిన బాలికలను ఇతర రాష్ట్రాల్లోని నిందితులు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసును చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
For More News..