వృద్దురాలిని వదల్లేదు..రూ.13.9లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్

వృద్దురాలిని వదల్లేదు..రూ.13.9లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్
  • 80 ఏండ్ల వృద్ధురాలి డిజిటల్ అరెస్ట్
  • రూ.13.9 లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్

బషీర్ బాగ్, వెలుగు: 80 ఏండ్ల వృద్ధురాలిని సైబర్ చీటర్స్ మోసగించారు. సిటీకి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగినికి తొలుత ట్రాయ్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చీటర్స్ తెలిపారు. ఆమె సిమ్ కార్డు, ఆధార్ కార్డులు డిస్కనెక్ట్ అవుతున్నాయని తెలిపి, ఫోన్ కట్ చేశారు. 15 నిమిషాల తర్వాత లక్నో పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నట్లు మరో కాల్ వచ్చింది. 

వృద్ధురాలి పేరుపై ఉన్న మొబైల్ నెంబర్ అక్రమ ప్రకటనలు, వేధింపులకు గురిచేసే టెక్స్ట్ మెసేజ్ లకు వాడుతున్నట్లు తెలిపారు. అలాగే మనీలాండరింగ్ కేసులోనూ ప్రమేయం ఉందని, అరెస్ట్ కూడా చేయబోతున్నట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ, ట్రాయ్, యూపీ ఈడీకి సంబంధించిన ఫేక్ పేపర్స్ ను ఆమె వాట్సాప్ కు పంపించారు. బాధితురాలిని వెంటనే లక్నో కు రావాలని పట్టుబట్టారు. 

అయితే, ఈ నేరాలకు తనకు సంబంధం లేదని , తాను వృద్ధురాలిని అని చెప్పిన స్కామర్ వినిపించుకోలేదు. ఈ కేసు నుంచి బయటపడాలంటే, ఆమె బ్యాంక్ అకౌంట్లను వేరిఫై చేయాలని, వాటి వివరాలను ఈడీ , ఆర్బీఐ కు పంపి దర్యాప్తు చేయించాలని నమ్మించాడు. దీంతో బాధితురాలు ఆమె రెండు బ్యాంక్ అకౌంట్ వివరాలను వెల్లడించింది. 

స్కామర్ సూచియించిన ఆర్బీఐ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేయాలని, వాటిని వారం రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు. దీంతో నిజమేనని నమ్మిన బాధితురాలు తన కొడుకు, మనవడి నుంచి డబ్బులను తన అకౌంట్ లోకి వేయించుకుని, స్కామర్స్ ఇచ్చిన నెంబర్లకు ఫోన్ పే , RTGS ద్వారా రూ.13,91,000 పంపించింది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారని స్కామర్లు బెదిరించారు. 

ఈ నెల 14 న మరో నెంబర్ నుంచి రూ.10 లక్షలు చెల్లించాలని మెసేజ్ వచ్చింది. దీంతో బాధిత వృద్ధురాలు మోసపోయానని గ్రహించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్​లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు.