- 4.20 లక్షల ఎకరాలలో వరి పంటే..
- తరువాతి స్థానంలో జొన్నలు, మక్కలు
- కూరగాయల ఊసులేని ప్రణాళిక
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో యాసంగికి సంబంధించి యాక్షన్ ప్లాన్రెడీ అయ్యింది. వాతావరణం, సాగునీటి లభ్యత, సీడ్, మార్కెట్ తదితర అంశాల ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్రణాళిక సిద్ధం చేశారు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందేలా అధికారులు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో వానకాలం సీజన్లో సాగయిన విస్తీర్ణానికి దాదాపు సమానంగా యాసంగిలోనూ రైతులు పంటలు సాగు చేయనున్నారు. ఈసారి వర్షాకాలంలో మంచి వానలు పడడంతో చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో భారీగా నీటినిల్వలు చేరాయి. దీంతో రైతులు పూర్తిస్థాయిలో సాగుకు సిద్ధపడుతున్నారు.
5.18 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో యాసంగిలో 5.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువగా వరి సాగు చేసే అవకాశం ఉంది. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 3.71 లక్షల ఎకరాలు కాగా ఈసారి 4.19 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున సన్నాల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.
సన్నాలకు రూ.500 బోనస్ఇస్తుండడంతో రేటు గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. నీటివసతి లేని ప్రాంతాల్లో ఆరుతడి పంటలు వేయనున్నారు. జొన్న 33,317 ఎకరాల్లో, మొక్కజొన్న 22,986, శనగ 16,076, సజ్జ 10,302, నువ్వులు 8,239, సన్ఫ్లవర్ 2,790, మినుములు 619, కుసుమ 378 ఎకరాల్లో సాగు కానుంది.
సీడ్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు
దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేందుకు 1.04 లక్షల క్వింటాళ్ల సీడ్ అవసరమవుతుంది. జొన్న విత్తనం 832 క్వింటాళ్లు, మక్క 1,834 క్వింటాళ్లు, శనగ 4,019 క్వింటాల్స్, మినుము 49.52 క్వింటాళ్లు, సజ్జ 412 క్వింటాళ్లు, నువ్వులు 164, సన్ ఫ్లవర్ 55, కుసుమ 15 క్వింటాళ్లు కావాలని జిల్లా ఆఫీసర్లు వ్యవసాయ శాఖకు రిపోర్టు పంపారు. యూరియా 75 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 18,951, కాంప్లెక్స్ ఎరువులు 46,367, ఎంఓపీ 12,618 టన్నులు అవసరమని అంచనా వేశారు.
ఆందోళనకరంగా వెజిటేబుల్ సాగు
జిల్లాలో కూరగాయల సాగు ఆశించిన స్థాయిలో జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఎప్పటిలాగే జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ యాసంగిలో అదే సీన్ రిపీట్కానుంది. కూరగాయల సాగు వైపు రైతులను ఆకర్శించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
యాక్షన్ ప్లాన్లో 4,067 ఎకరాల్లో ఇతర పంటల సాగు జరుగుతుందని పేర్కొన్న అధికారులు అందులో అయినా కూరగాయలు పండించేలా చూడాలని పలువురు సూచిస్తున్నారు. గతంలో సోయా అధికంగా పండించిన రైతులు రెండేండ్లుగా సబ్సిడీపై సీడ్ సరఫరా చేయకపోవడంతో ఆ పంటకు దూరమయ్యారు.