ఒక యాడ్..ఎన్నో ప్రశ్నలు

అసలే డిజిటల్ యుగం. యాడ్స్​ చూసి వస్తువులు కొనే కాలం. వాణిజ్యానికి యాడ్సే వెన్నెముక. యాడ్​ ఏదైనా టార్గెట్ కస్టమర్లే.
వారి కులం, మతం, ప్రాంతం, భాష.. ప్రకటనకు అనవసరం. అందరినీ ఆకర్షించడమే యాడ్​ లక్ష్యం. ఐక్యత దేశానికి ఎంత అవసరమో, వాణిజ్యానికి అంతకు మించి అవసరం ఉంది. అందుకే అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు దేశ సమైక్యతను చాటుతూ వస్తుంటాయి. అలాంటి యాడ్స్​ సామరస్యాన్ని ఆకాంక్షించే వారి హృదయాలను తాకుతాయి. తనిష్క్ యాడ్ తాజాగా ఆ దారిలోనే వచ్చింది. మత సామరస్యం గురించి కలలుగనే వారందరికీ అది నచ్చింది. కానీ ఏక మత సార్వభౌమత్వాన్ని కోరుకునేవారికి అది నచ్చలేదు. అంతే, ఆ ప్రకటన మీద విషం కురవడం మొదలైంది. దీంతో టాటా వారి ఫ్రాంచైజ్ లో నడిచే తనిష్క్ తలదించక తప్పలేదు.

తనిష్క్​ యాడ్ లో అభ్యంతరకర విషయం ఏముంది? యాడ్ డిజైన్ చేసిన వారు ఉత్తరాదిని, దక్షిణాదిని కలుపుతూ హిందూ–ముస్లిం ఐక్యతను కోరుతూ సందేశాత్మకంగా ఉండాలని భావించారు. తనిష్క్ నగలు ఏ కులం వారి మెడలోనైనా, ఏ మతం వారి ఒంటి మీదైనా సమానంగానే మెరిసిపోతాయి. దేశ సమైక్యత తమ ఆభరణాలకు అద్దిన అదనపు మెరుపు అని తనిష్క్ వారు భావించి ఉంటారు. కోడలు కడుపుతో ఉన్నది. అత్తగారింట పండగ జరుగుతుంది. మలయాళంలో దానికో పేరుంది. తెలుగునాట సీమంతం అంటాం. విషయం అదే అయితే సమస్య లేదు. ఆమె కేరళకు చెందిన హిందూ యువతి. అత్తవారు ఉత్తరాదికి చెందిన ముస్లింలు. అలాగని ఈ యాడ్ లో ఎక్కడా చెప్పరు. ఆ వాతావరణాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. అత్తగారింట కోడలి కోసం వేడుక జరుగుతోంది. కోడలి వేషధారణ, అత్తగారు, ఆ ఇంట్లో ఇతర సభ్యుల వేషధారణతో ఎవరు ఏమిటో మనకు తెలుస్తుంది. కోడలంటుంది, ‘అమ్మా మీ ఇళ్లల్లో ఇలాంటి సంప్రదాయం లేదు కదా’అని. అప్పుడు అత్తగారంటుంది, ‘బిడ్డలను సంతోషపరిచే సంప్రదాయం ప్రతి ఇంటా ఉంటుంది కదమ్మా’అని. దేశం ఐక్యంగా ఉండాలని ఆశించే గుండెకు ఈ యాడ్​ హత్తుకుపోతుంది. తనిష్క్ వారి టార్గెట్ ఏ సరిహద్దులూ లేని కన్జూమర్. తమ బంగారానికి ఎలాంటి హద్దులూ లేవని, అది అందరిదీ అని, అందరినీ సమానంగా ఆహ్వానించడమే తనిష్క్ వారి ఆలోచన. తనిష్క్ నగ అంటే ఏకతా సౌందర్యం అని ఆ ప్రకటన చెప్తోంది.

వెనక్కి తగ్గిన తనిష్క్

భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి ఆయువుపట్టుగా గొప్పలు చెప్పుకుంటాం. మరి ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు అలాంటి లౌకిక భావన మరింత బలపడాలి కదా. కానీ కొందరికి అందులో మత ప్రచారం కనిపించింది. ముస్లింలు, హిందువులను అడ్డదారిలో ఆక్రమించుకునే కుట్ర కనిపించింది. హిందూ యువతులను పెండ్లిండ్లు చేసుకుని ముస్లింల సంఖ్యను పెంచుకోవాలనే మహా కుతంత్రం కనిపించింది. అదే లవ్ జిహాద్. ఇక మొదలు పెట్టారు. తనిష్క్ ని ట్రోల్ చేయడమే మహోద్యమంగా సాగించారు. చివరికి టాటా అంతటి దిగ్గజ సంస్థ దిగిరాక తప్పలేదు. ఆ యాడ్ ని వెనక్కి తీసుకుంది. పైగా తమ యాడ్ ఒక వర్గం వారి మనోభావాలను దెబ్బ తీసేలా ఉందేమో అన్న ఒప్పుకోలుతో క్షమాపణలాంటి ప్రకటన కూడా చేసింది. ఇది తమ దుకాణాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని చేసినట్టు చెప్పుకుంది. కానీ టాటా వంటి సంస్థ వెన్నుదన్నుగా ఉన్న తనిష్క్ ఎందుకు ఇలా వెనక్కి తగ్గింది? తాము నమ్మిన ఏకత్వానికి ఎందుకు కట్టుబడి నిలబడలేదు? ఈ వివాదంతో తమ వ్యాపార ప్రయోజనం నెరవేరింది కదా చాల్లే అని ఊరుకున్నారా? కావొచ్చు. కానీ దేశం ఊరుకోలేదు.

లౌకికవాదులే టార్గెట్

లౌకిక భావనల పట్ల, దేశ ఐక్యత పట్ల విశ్వాసం ఉన్న ఎందరినో ఇది కలచివేసింది. చాలా మందిలో చాలా ప్రశ్నల్ని రేపింది. హిందూత్వం అంటే ఏమిటి? భిన్నత్వంలో ఏకత్వం కాదని, మెజారిటీ మతమే అని చాటడమా? దేశం భిన్న జాతులు, మతాలు, భాషలు, సంస్కృతుల సమాహారం కాదా? దేశ సమైక్యత, సమగ్రత అంటే మెజారిటీ మత సమైక్యతేనా? ఆలోచనాపరులను కుదిపివేస్తున్న ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. కొన్ని సార్లు కోర్టుల్లో కేసులు పెట్టి, కొన్నిసార్లు దాడులు చేసి, మరికొన్ని సార్లు ఏకంగా హత్యలే చేసి అదంతా హిందూత్వం పేరు మీద సాగిస్తున్న మహత్కార్యంగా కొందరు భావిస్తున్నారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టి వెంటబడి వేటాడి వికృతంగా వినోదిస్తారు. తనిష్క్ యాడ్ కి వ్యతిరేకంగా జరిగింది ఇలాంటిదే. ఇది హిందూత్వం కాదని, ఏకంగా హిందూ మతానికి ఈ అకృత్యాలను అంటగట్టడం సబబు కాదని వాదించే ఎందరో హిందూ మేధావులు, నాయకులు, రచయితలు, కవులు, కళాకారులు ఉన్నారు. అయితే అలా ప్రజాస్వామ్యం, లౌకికత్వంపై విశ్వాసం ప్రకటించే వారినీ టార్గెట్ చేస్తున్నారు.

ఇంకా స్త్రీని ఆటవస్తువుగానే చూస్తారా?

ఇది మొత్తంగా హిందూ మతాన్నే ప్రపంచం ముంగిట అపహాస్యం చేయడం కాదా?  మా కులంలోని స్త్రీ మరో కులం వాడిని ప్రేమించకూడదని, మా మతంలోని అమ్మాయి మరో మతంవాడిని పెండ్లాడకూడదని నిషేధాజ్ఞలు జారీ చేయడం నిరంకుశత్వానికి పరాకాష్ట. స్త్రీలను వస్తువులుగా చూసే ఆటవిక న్యాయానికి చిహ్నం. టెక్నాలజీ కాలంలోనూ మధ్యయుగాల నాటి ఆధిపత్యాలు ఎంత వరకూ ఆమోదయోగ్యమో ఆలోచించాలి. భావప్రకటనా స్వేచ్ఛను సహించని శక్తులు పెరిగితే దేశానికి అరిష్టమని అర్థం చేసుకోవాలి. వీటిని మొగ్గలోనే తుంచేయగల నిజాయతీ, సాహసం నాయకులకు ఉండాలి. సమైక్య భారతం ఉపన్యాసాలతో సాధ్యం కాదు. దానికి గొప్ప నిబద్ధత కావాలి.

డా.ప్రసాదమూర్తి, కవి, సామాజిక విశ్లేషకుడు