మద్యానికి బానిసై కొడుకును అమ్మేసిన తండ్రి

నాగర్​కర్నూల్​ జిల్లా పదరలో ఘటన 
అమ్రాబాద్, వెలుగు: మద్యం తాగేందుకు పైసలు లేవని నాగర్​కర్నూల్​జిల్లాలో భార్యకు తెలియకుండా కన్న కొడుకును అమ్మేశాడో తండ్రి. వివరాల్లోకి వెళ్తే.. పదర మండల కేంద్రానికి చెందిన నల్లబోతుల మల్లయ్య, ముత్యాలమ్మకు ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. తాగుడుకు బానిసైన మల్లయ్య తన మూడో కొడుకు(4నెలలు)ను మంగళవారం అమ్రాబాద్​లో అమ్మేశాడు. ఆ పైసలతో ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. కొడుకు ఎక్కడ అని భార్య నిలదీయగా, మత్తులో ఉన్న మల్లయ్య ఏమీ చెప్పలేదు. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న ముత్యాలమ్మ గ్రామస్తులు, పోలీసులు, ఐసీడీఎస్, డీసీపీయూ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు మల్లయ్యను విచారించి, అమ్రాబాద్ లో అమ్మినట్లు గుర్తించారు. ఆమనగల్ వద్ద బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. హెల్త్ చెకప్ చేయించి మహబూబ్ నగర్ శిశుగృహకు తరలించారు. పదర, అమ్రాబాద్ ఎస్సైలు తిరుపతిరెడ్డి, వీరబాబు, ఐసీడీఎస్ సీడీపీఓ దమయంతి, డీసీపీయూ సిబ్బంది సృజన పాల్గొన్నారు.