స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో మహాలక్ష్మి స్కీం ప్రారంభోత్సవంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్‌లో పథకాన్ని ఆర్డీఓ రామ్మూర్తి , జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా లీడర్లు చింత జ్యోత్స, నారగోని పద్మ, మరికొందరు బస్సెక్కుతూ జై కాంగ్రెస్, జై సీఎం రేవంత్ అంటూ నినాదాలు చేశారు.
దీంతో ఎంపీపీ కందుల రేఖ భర్త గట్టయ్య, ఎంపీటీసీ గన్ను నర్సింహులు ‘ఇది ప్రభుత్వ ప్రోగ్రాం.. నినాదాలు ఎందుకు చేస్తున్నారు’ అని అడ్డుకున్నారు. ప్రతిగా జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆర్డీవో సమక్షంలో కాసేపు ఇరు పార్టీల లీడర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఎంపీపీ భర్త కందుల గట్టయ్య కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.