నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు : ట్రీట్‌మెంట్ చేయించుకోలేక అంబులెన్స్‌లో ఇంటికి వస్తున్న ఐదేండ్ల బాలుడిని మృత్యువు కబలించింది. అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులో ఉన్న బాలుడు చనిపోయాడు. ఈ ప్రమాదం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలో సంగారెడ్డి – అకోలా నేషనల్ హైవేపై గురువారం తెల్లవారుజామున జరిగింది. మహారాష్ట్రలోని దెగ్లూర్ మండలం జైగావ్ గ్రామానికి చెందిన సాత్విక్ (5) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
దీంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో అంబులెన్స్‌లో తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిజాంసాగర్ మండలం నర్సింగ్‌రావ్‌పల్లి వద్దకు రాగానే అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న సాత్విక్ అక్కడికక్కడే చనిపోయాడు. బాలుడి తండ్రి ఉమాకాంత్ శంకర్‌రావు మానే ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ తెలిపారు.