
- ఫైటర్ జెట్ల ఎస్కార్ట్‌తో రోమ్‌లో దించిన అధికారులు
వాషింగ్టన్: న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో రోమ్కు మళ్లించారు. ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ తో రోమ్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేయించారు. అమెరికా టైం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ఏఏ292 శనివారం (ఈనెల 22) రాత్రి 8.11 గంటలకు న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానం నుంచి టేకాఫ్ అయింది.
ఆదివారం మధ్యాహ్నం ఫ్లైట్ ఢిల్లీకి మూడు గంటల దూరంలో ఉండగా.. విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమాన సిబ్బంది ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు. వారి సూచనలతో విమానాన్ని రోమ్కు మళ్లించారు. ‘‘భద్రతా కారణాల వల్ల విమానాన్ని రోమ్కు మళ్లిస్తున్నాం. ప్రయాణికులు ఆందోళన చెందవద్దు” అని విమాన సిబ్బంది సూచించారు.
కాసేపటి తర్వాత యూరప్ కు చెందిన రెండు ఫైటర్ జెట్లు ఆ విమానానికి ఎస్కార్టుగా వెళ్లాయి. రోమ్ లోని ఫియుమిసినో ఎయిర్ పోర్టులో ల్యాండయింది. విమానాన్ని ఫైటర్ జెట్లు ఎస్కార్ట్ చేస్తున్న విజువల్స్‌ను ఇటాలియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. కాగా.. ఫ్లైట్‌ను మధ్యలోనే దారిమళ్లిస్తున్నట్లు విమాన సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురయ్యామని ఫ్లైట్‌లోని ఇండియన్ ప్రయాణికులు తెలిపారు.
రోమ్‌లో దిగిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ‘‘విమానాన్ని దారి మళ్లిస్తున్నట్లు సడన్‌గా చెప్పడంతో అందరం భయపడ్డాం. పరిస్థితిని క్యాబిన్ సిబ్బంది తెలివిగా హ్యాండిల్ చేశారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు” అని ఇండియన్ ప్రయాణికులు పేర్కొన్నారు. అయితే.. రోమ్‌లో తాను చిక్కుకుపోయాయని లక్కీ చావ్లా అనే భారతీయ ప్రయాణికుడు ‘ఎక్స్’ లో తెలిపాడు. తన లగేజీ మిస్ అయిందని వాపోయాడు.