ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదే విజయం అంటూ తమ క్యాడర్‌ను నిలుపుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితాలలోపు ఏ పార్టీ అని చూడకుండా కొన్ని విషయాల్ని ప్రజాదృష్టితో మాట్లాడుకుందాం. ఉచితాలు సముచితం కావంటూనే, 80 కోట్లమందికి ఐదేండ్లపాటు 5 కిలోల బియ్యం ఇస్తాం అని ( కొవిడ్ కాల పథకం) మోదీ గ్యారంటీ ఇచ్చారు! అందరికీ విద్య, వైద్యం ఉపాధి విధానాలు కావాలి. ఉచితాలు సముచితం కావన్న కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
‘420 వాగ్దానాలు’ అంటూ గెల్చిన పార్టీని రోజూ నిందిస్తున్నారు. పదేండ్ల తమ నిర్వాకం ఏమిటి? దళితుడే ముఖ్యమంత్రి వంటివి వదిలేద్దాం. అర్హులైన ఎస్సీ, ఎస్టీలందరికీ మూడెకరాల భూమిచ్చారా? డబుల్ బెడ్ రూమ్ ఇల్లు 90 శాతానికి ఇవ్వలేదే! ఆదివాసులకు పోడు భూముల్ని కుర్చీ వేసుకుని అమలుచేస్తానని 2014 నుంచి వాగ్దానాలు చేస్తూ, 90 % గిరిజనులకు వట్టి చేయి చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగ ఖాళీలు లక్షలాదిగా ఉన్నాయి..ఇస్తామంటూ అందులో సగమైనా ఇవ్వలేదు. లక్షలాదిగా అప్పులు చేసి, ఏండ్లు మీరిపోతున్న వేలాది ఉద్యోగార్థులు ఊరూరూ తిరిగి చెప్పి కేసిఆర్ పార్టీని ఓడించారు. తామే చేజేతులా ఇచ్చిన అవకాశాన్ని కొత్త ప్రభుత్వం ఉపయోగించుకుని, 30 వేల ఉద్యోగ పత్రాలిస్తే దాన్నీ తప్పు పడుతున్నారు. ప్రజలు వారికిచ్చిన రెస్ట్ తీసుకుని, ఐదేండ్లు వేరే పాలననీ చూసే ప్రజాస్వామ్యం ప్రజలకుండాలి.
ఎవరి ప్రాధాన్యాలు వారివి కాళేశ్వరం వంటి వాటి గురించి తప్పులు, ప్రశ్నలు ముందుకొచ్చాయి కదా ఏమంటారు? అన్న ప్రశ్న కూడా పూర్తవకుండానే, అందులో తప్పులు జరిగాయని మీకెవరు చెప్పారు అని ఒక ప్రముఖ టీవీ చానల్లో బుకాయించారు కేటీఆర్. శాసనసభలో, మీడియాలో ఆరోగ్యకరమైన చర్చలు లెక్కలతో కూడిన శ్వేతపత్రాలెన్ని ఉన్నా, బీఆర్ఎస్ అగ్రనేతలు ఉష్ట్రపక్షిలా వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం గురించి క్లాసులు తీసుకున్న కేసిఆర్ కాస్త నయం. అది గిట్టుబాటు కాదు కదా, పంటల ఆదాయం కన్నా భారీ ఖర్చు కదా అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే ‘అది మంచి ప్రశ్నే, కానీ, మా ప్రాధాన్యాలు మాకుంటాయన్నదే మా సమాధానం’ అని బల్ల గుద్దారు. అయితే, కొత్త ప్రభుత్వానికీ వేరే ప్రాధాన్యాలుంటాయి కదా అన్న విచక్షణా జ్ఞానం, ఇంగితం వారిలో లోపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం తన ప్రాథామ్యాలతో తాను పునర్ రచన చేసుకోవటానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికం.
రైతుబంధుపై కేసీఆర్ నీతి పాఠాలు
రైతుబంధు 5 ఎకరాలు మించినవారికి ఇస్తే మీ ముల్లె పోతుందా అని ప్రశ్నించారు కేసీఆర్. ముల్లె ముఖ్యమంత్రులది కాదు, ఇది ప్రజాధనం అన్న స్పృహ ఉండాలి కదా. బాగా అవసరముండే చిన్న రైతులకు పరిమితం చేయటం మంచిదని తమ పార్టీ నేతలే కాక, కొందరు అధికారులూ అప్పట్లోనే గట్టిగా సూచించారు. వ్యవసాయం చేస్తున్న భూములకు మాత్రమే ఇవ్వాలి అంటే అదీ తప్పే! రైతుకింత అనికాక, ఎకరానికింత అని ఇవ్వటమే సరికాదు. అయినా 10, -50, -100 ఎకరాల వారికీ, - విదేశాల్లో ఉన్న ధనికులకీ రియల్ ఎస్టేట్లవారికీ - వందలాది కోట్లు ఇన్నేళ్లూ దోచిపెట్టి ఖజానా ఖాళీ చేశారు. దానికి భిన్నంగా తమ ప్రాథామ్యాలతో పనిచేసే వెసులుబాటు గెలిచిన పార్టీకి ఉండాలి కదా. రైతుబంధుని (ఆంధ్రలోవలె) కౌలుదార్లకే కాక, కూలీలకూ ఇస్తాం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అది మంచిదే. మిగతావి చర్చించాకే మార్పులు చేస్తాం అంటున్నారు. అలాగే దళితబంధు పేరిట అస్మదీయులకూ, దళారులకూ తమవలెనే దోచిపెట్టాలన్న ఒత్తిడి అర్థరహితం.
అవినీతి అసత్యమా?
కాళేశ్వరం తదితర విషయాల్లో వారు చేసిన తప్పులు, అక్రమాల గురించి శాసనసభలో శ్వేతపత్రాలు సమర్పిస్తే అదంతా కాలయాపన అని కొట్టి పారేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం నిధులు, డబ్బులు, బడ్జెట్లు శాసనసభల కీలక కర్తవ్యం అన్నమాటని మరుగు చేస్తున్నారు. తామూ పత్రాలు, ఉపన్యాసాలు ఇచ్చారు కదా! తెలంగాణలో ఇరిగేషన్, విద్యుత్తు ప్రాజెక్టులు వగైరాల్లో తీవ్ర వైఫల్యాలు, అక్రమాలు, అవినీతిపై ఏండ్ల తరబడిగా చర్చలు సాగినాయి. వాటిని ప్రశ్నించినవారి నోరు నొక్కి అవన్నీ అసత్యాలే అంటూ గంపగుత్తగా తోసిపుచ్చారు కేసీఆర్. ఓటమికి ఇదొక ముఖ్యాంశం. విచారణ కమిషన్లు దర్యాప్తులు సాగుతుండగానే వ్యాసాలెందుకు అని నిపుణుడు వెదిరె శ్రీరామ్‌పై నినదించారు వి.ప్రకాష్. మరి ఈలోగా ఈ వీరంగం ఎందుకు
అని తమ బాసుని ప్రశ్నించే ఇంగితం వారికి లేకపోవచ్చును.
‘420’ మాటలతో ఇంకెంతకాలం రాజకీయం?
కాళేశ్వరం విద్యుత్తు ప్రాజెక్టుల గురించి రచ్చ రచ్చ అయింది. వారి కూలిన పాలననీ, ప్రాజెక్టులకు పడిన బీటల్నీ మరుగుపరచి, అంతా బట్టబయలైనాక, న్యాయ విచారణ మేమే కోరాం అంటూ గొప్పలు చెబుతున్నారు కుటుంబ పార్టీ నేతలు. కొంతకాలం రెస్టు తీసుకోండి అని జనం 'సెలవిచ్చా'రని వారు గ్రహించాలి కదా. కేసీఆర్ శాసనసభకు వచ్చి సూచనలు ఇవ్వాలని, కాకపోతే ఆయన ఇంటికెళ్లి తెలుసుకోవటానికైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి చెప్పినా స్పందించకుండా, ‘420 మాటలతో’ ఇంకెంతకాలం రాజకీయం చేస్తారు? విద్యుత్తు రంగంలో అవకతవకలు, భారీ రుణాలు ఉన్న దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక ఎకరంలో నీరు పారించడానికి మూడు గంటలు విద్యుత్తు సరిపోతుంది అని ఒక రైతుగా రేవంత్ రెడ్డి అభిప్రాయం సరైంది. దాని ప్రకారమే విద్యుత్తుని ఉచితంగా ఇవ్వాలి. అంతేగాని పోటీపడి 24 గంటలు ఇవ్వటం తప్పు. అది భూస్వాములకూ, అక్రమ వినియోగదారులకూ ఇతరేతర దుర్వినియోగానికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధానాన్ని మానుకోవాలి.
లోక్‌సభ ఫలితాలకైనా కేసీఆర్ కట్టుబడతారా?
ప్రజాందోళన పేరిట కిరాయి అనుచరుల అరాచకం మంచిది కాదు. అలాంటివారు అన్నిపార్టీలకూ ఉన్నారు. ఉద్యమ పార్టీవారే ఫక్తు రాజకీయం చేస్తామన్నప్పుడు అందులో ఆరితేరిన పార్టీవారు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ఇలాంటివాటిని ప్రజలు అనుమతించకూడదు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తీర్పుకైనా కేసీఆర్ కట్టుబడతారా? అనేది వేచి చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టుని అలాగే కొనసాగిస్తే అది శాశ్వతంగా రాష్ట్రానికి గుదిబండ కాబోతున్నది. వీలైన రిపేర్లు చేయాలి అన్నది స్వతంత్ర నిపుణుల హితవచనం. అన్నిట్లోనూ కేసీఆర్
పై కోపంతో, రాజకీయ కక్షతో కాకుండా నిపుణుల సూచనల మేరకు తెలంగాణ ప్రయోజనాలే
లక్ష్యంగా వ్యవహరిస్తాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆయన తన మాట నిలబెట్టుకుని విభిన్నంగా ప్రవర్తిస్తారని ఆశిద్దాం. మూడో రోజు నుంచే మీ ప్రభుత్వం పడిపోతుంది అని శాపనార్ధాలు,. తమకీ గెలిచిన పార్టీకీ తేడా 1.5శాతం ఓట్లే అని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే. ఓట్ల దామాషా ప్రకారం సీట్లులేని తప్పుడు పద్ధతిని వద్దనగలరా? వారి విధానాల్ని, విలాస నిర్మాణాల్ని, పద్ధతుల్ని ఆమోదించక 60% ప్రజలు ఇతరులకు ఓటు వేశారు. నిపుణుల సలహాల్ని, ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ సర్కార్ అన్నిటినీ పరిష్కరించాలి. తమది భిన్నమైన ప్రజాపాలన అన్నమాటను రుజువు చేసుకోవాలి.
ప్రజావసరాలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలి
నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు దుబారాని ప్రోత్సహిస్తుంది. జనాభాలో 90 శాతం మందికి నెలకు 100 యూనిట్ల కన్నా అవసరంలేదు. దానికి తగినట్టు విధివిధానాలు రూపొందించాలి.
ప్రతి యూనిట్ విద్యుదుత్పత్తికి ఎన్ని వనరులు, ఖర్చులు కావాలో, ఎన్ని పర్యావరణ భారాలు, దుష్పరిణామాలు ఉంటాయో వివరించి వినియోగం తగ్గించాలి. కాగా, యాదాద్రిపై చూపిన శ్రద్ధలో.. ఖర్చులో పదోవంతైనా ఉస్మానియా ఆసుపత్రిపై పెడితే బాగుండేది. ఉన్నవి ఉండగా అంబేద్కర్ మరో విగ్రహంపై వందలాది కోట్ల ఖర్చుకు బదులుగా అంబేద్కర్ నొక్కిచెప్పిన విద్యారంగానికి కేటాయిస్తే ఆయన ఆశయం సార్ధకం అయ్యేది. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంపై దృష్టిపెట్టి పనికి దిగుతాను అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బియ్యం కార్డుని ఆరోగ్యశ్రీని విడదీయడం మంచిదే, అలాగే ఫార్మా 'విలేజెస్', సామాన్యులకి, పాత నగరానికీ మేలు కలిగేలాగా మెట్రోలో మార్పులు వంటివి మంచి ఆలోచనలు. ప్రజల ప్రాథమిక అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథామ్యాల్ని రూపొందించుకొని వ్యవహరించాలి. ఎన్నికలై పోయాయి కాబట్టి బడా(యి) వాగ్దానాలు వద్దు. ఆడంబరాలకు పోవద్దు. ఇంజినీర్లు, నిపుణుల సూచనల ప్రకారం వ్యవహరిస్తామని ప్రభుత్వం చెప్తున్నా తోసిపుచ్చి, 50 వేల మందితో వచ్చి మూకస్వామ్యం అమలు చేస్తాం అని బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారు. అది దౌర్జన్యం.
- డా. ఎం. బాపూజీ,
సీఎస్ఐఆర్ సైంటిస్ట్(రిటైర్డ్), సోషల్ యాక్టివిస్ట్