
అనగనగా ఒక ఊళ్లో ఒక పావురం ఉండేది. దానికి పాడుకోవటం అలవాటు. అలా ఒకరోజు చెట్టు మీద కూర్చుని పాడుకుంటోంది. సరిగ్గా అప్పుడే చెట్టు కింద ఉన్న నదిలో ఒక చీమ కొట్టుకుపోతూ కనిపించింది. దాని ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంటుంది పావురం. అంతే వెంటనే ఒక ఆకును చీమకు దగ్గరగా వేస్తుంది. వెంటనే చీమ ఆ ఆకు మీద కూర్చుంటుంది. ఆ ఆకు నీటి ప్రవాహంతో ప్రయాణించి, గట్టుకు చేరుకుంటుంది. వెంటనే చీమ బయటకు వచ్చి, తనను కాపాడిన పావురానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.
అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజున చీమ అలా తిరుగుతుండగా, తనను రక్షించిన పావురం చెట్టు మీద కూర్చుని తనలో తాను హాయిగా పాడుకుంటూ కనిపించింది. అదే సమయంలో ఒక వేటగాడు ఆ పావురాన్ని చంపడానికి బాణం వేయబోతూ కనిపించాడు. ఆ విషయాన్ని పావురం గమనించదు. వెంటనే చీమ ఏం చేయాలా అని ఆలోచించి, పుటుక్కున బోయవాడిని కుడుతుంది. దాంతో బోయవాడి బాణం గురి తప్పుతుంది. అలా పావురం ప్రాణం కాపాడుతుంది చీమ. బోయవాడు చీమను తిట్టుకుంటూ వెళ్లిపోతాడు. అప్పుడు ఆ చీమ పావురం దగ్గరకు వచ్చి ‘‘నువ్వు నా ప్రాణం కాపాడావు. అప్పుడు నేనెవరో కూడా నీకు తెలియదు. నీకు, నాకు మధ్య స్నేహం కూడా లేదు. కాని ఇప్పుడు నేను మాత్రం నువ్వు చేసిన ఉపకారానికి ఉపకారం చేస్తున్నా. నా కంటె నీవే గొప్ప’’ అని వినయంగా మాట్లాడుతుంది. తనకు సంబంధం లేని చీమకు సాయం చేసిన పావురం గొప్పదా? తనకు ఉపకారం చేసిన పావురానికి సాయపడిన చీమ గొప్పదా? అని ప్రశ్నించుకుంటే...
రెండూ గొప్పవే.
సాయం చేయటం అనే గుణమే గొప్పది. ఆపదలో ఉన్నవారిని కాపాడటం ప్రతి ప్రాణి ధర్మం. ఆపదలో ఉన్న వ్యక్తి మనకు కావలసినవారా? మనకు మళ్లీ సాయపడతారా? వీరి గుణం ఎటువంటిది? వంటివి ఆలోచించకుండా వెంటనే సాయం చేయడం అవసరం అని పెద్దలు చెప్తుంటారు.
రామాయణంలో...
రామరావణ యుద్ధంలో రావణుడు మరణించాడు. ఆయనకు విధ్యుక్తంగా కర్మకాండ చేయమని రాముడు చెప్తాడు. అందుకు విభీషణుడు, ‘రామా! ఇంతటి దుర్మార్గుడికి నేను కర్మకాండ చేయాలా?’ అని ప్రశ్నించాడు. అందుకు రాముడు, ‘విభీషణా! ఒక వ్యక్తి మరణంతో శత్రుత్వం కూడా నశించాలి. ఆయన అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వర్తించు’ అన్నాడు రాముడు. రాముడు లేని సమయంలో సీతను అపహరించి, ఆమెను ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు రావణుడు. ఒక సంవత్సరం పాటు సీత కోసం అన్వేషిస్తూ విలపించాడు రాముడు. అయినప్పటికీ, రావణుడి వంటి యోధుడు మరణించటంతో, ఆయన పట్ల శత్రుత్వ భావన మరణించాలని పలికినవాడు రాముడు. అంతేకాదు – శత్రువు యొక్క సోదరుడైన విభీషణుడు వచ్చి శరణు కోరిన సమయంలో, రాముడు సుగ్రీవాదులతో సంప్రదించి, విభీషణునికి అభయమిచ్చాడు.
పాండవులు జూదంలో ఓడిపోయి, అరణ్యవాసం చేస్తున్న రోజులలో... ఒకనాడు దుర్యోధనుడికి దురాలోచన కలిగింది. తాము ఎంత గొప్పగా సంపదలు అనుభవిస్తున్నామో పాండవులకు చూపాలనే కోరిక కలిగింది. కర్ణుడితో కలిసి అరణ్యాలకు వెళ్లారు. అక్కడ ఒక స్త్రీని చెరపట్టాడు దుర్యోధనుడు. ఆమె గంధర్వ కాంత అనే విషయం వానికి తెలియదు. గంధర్వులు కోపించి, కౌరవుల మీదకు దండెత్తి వచ్చి, కర్ణుడు సహా అందరినీ బంధించారు. విషయం తెలుసుకున్న ధర్మరాజు, ‘అర్జునా! నువ్వు వెళ్లి వారందరినీ విడిపించు’ అని ఆజ్ఞాపించాడు. అన్నగారి ఆజ్ఞను శిరసావహించాడు. గంధర్వులను ఓడించి, కౌరవులను, కర్ణుడిని బంధ విముక్తులను చేశాడు. తమను అరణ్యాల పాలు చేసినప్పటికీ, హస్తినాపురానికి కళంకం రాకూడదనే ఉద్దేశంతో అర్జునుడు కౌరవులను రక్షించాడు. అంటే ఆపదలో ఉన్న వ్యక్తిని తక్షణమే కాపాడాలే కాని, వారి వల్ల తమకు కలిగిన నష్టం గురించి ఆలోచించకూడదనే పెద్దల వాక్యాన్ని అనుసరించారు పాండవులు.
ఈ విషయంలో16 వ శతాబ్దపు మరాఠా రాజు శివాజీ మహరాజ్ ఔన్నత్యాన్ని ఎంత చెప్పుకున్నా తక్కువే. యవనులతో జరిగిన యుద్ధంలో గెలుపొందిన తర్వాత కూడా, సోనదేవుడు బంధించి తెచ్చిన యవనకాంతను ఇంటి అడపడుచులా మర్యాదగా పంపిన ఘనుడు వీర శివాజీ. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా
అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!
- డా. వైజయంతి పురాణపండ
ఫోన్: 80085 51232