
- బీజేపీ అభ్యర్థి ర్యాలీలో గొడవ
- తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక వర్గంపై మరో వర్గం ఫైర్
- దాడులకు దారితీసిన వాగ్వాదం
పెద్దపల్లి, వెలుగు:బీజేపీ నాయకులు కొట్టుకున్నారు. పెద్దపల్లి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గురువారం పెద్దపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు తమ చేతుల్లో ఉన్న జెండాలతో కొట్టుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ రావు ఒక వర్గంగా ఏర్పడి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ వర్గం నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రచార ర్యాలీలో కూడా తమను గుర్తించడం లేదనే కోపంతో గుజ్జుల వర్గానికి చెందిన పలువురు నాయకులు.. ప్రదీప్ వర్గానికి చెందిన నాయకులను ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఆవేశంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు కలుగజేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ గొడవలో రెండు వర్గాలకు చెందిన నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇరు వర్గాల నాయకులు పోలీసుస్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.
ఇద్దరి పేర్లతో బీఫామ్.. అభ్యర్థిపై ఉత్కంఠ
లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో పూర్తయినా పెద్దపల్లి బీజేపీలో మాత్రం టికెట్ పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ను ఇది వరకే పార్టీ హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, కొద్ది రోజులుగా గోమాస శ్రీనివాస్‌ను మారుస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో బీ ఫామ్లేకుండానే పెద్దపల్లి అభ్యర్థిగా రెండు రోజుల క్రితం గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేశారు.
కానీ, అనూహ్యంగా బీజేపీ హైకమాండ్ బీ ఫాంలో గోమాస శ్రీనివాస్‌తో పాటు ఆల్టర్నేట్(ఆబ్లిక్) గా ఎస్.కుమార్ పేరును కూడా చేర్చి నామినేషన్ వేయడానికి చివరి రోజైన ఏప్రిల్25న ఇద్దరికీ బీఫాంలు అందజేసింది. దీంతో ఎస్.కుమార్ చివరి రోజు బీఫాంతో నామినేషన్ వేశారు. గోమాస కూడా ఆర్ఓకు బీఫాం అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి బీజేపీలో ఎవరు ఫైనల్ అవుతారో తేలడం లేదు. నామినేషన్ల పరిశీలన తర్వాత మాత్రమే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.