- సభలో మంత్రి సీటులో కూర్చున్న కామారెడ్డి ఎమ్మెల్యే
- అది ప్రొటోకాల్ ఉల్లంఘన అవుతుందన్న మంత్రి తుమ్మల
- 8 నెలలుగా తమ ప్రొటోకాల్‌ను పట్టించుకోవడం లేదన్న బీజేపీ ఎమ్మెల్యేలు
- సభలో చర్చించాలని పట్టు
హైదరాబాద్, వెలుగు : శాసన సభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య ప్రొటోకాల్ అంశంపై వాగ్వాదం జరిగింది. నియోజకవర్గాల్లో తమకు గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని, ఈ అంశంపై చర్చించాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. తొలుత సభ ప్రారంభానికి ముందు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీట్లో కూర్చున్నారు. అయితే, అలా కూర్చోవడం ప్రొటోకాల్ ఉల్లంఘన అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు సూచించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంకటరమణారెడ్డి.. తన సీట్లో కూర్చున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం మీద సీఎం ప్రసంగంపై చర్చించే సందర్భంగా మరోసారి ప్రొటోకాల్ అంశం చర్చకు వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డికి స్పీకర్ మైక్ ఇవ్వగా తెలంగాణ తల్లి విగ్రహం గురించి కాకుండా ప్రొటోకాల్ అంశంపై మాట్లాడారు. నియోజకవర్గాల్లో తమకు ప్రొటోకాల్ దక్కడం లేదని మండిపడ్డారు. తన ఐడీ కార్డును చూపిస్తూ.. ‘ఇది తనకు ఎమ్మెల్యే అని గుర్తిస్తూ ఇచ్చిన ఐడీ కార్డే కదా.. నియోజకవర్గాల్లో తమకు గుర్తింపే దక్కనప్పుడు, అడుగడుగునా ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు ఈ కార్డుకు విలువేంటి?’ అని ప్రశ్నిస్తూ కార్డును తాను కూర్చున్న టేబుల్‌పైకి విసిరికొట్టారు. దీనిపై మంత్రి సమాధానం ఇవ్వాలని, ప్రొటోకాల్‌పై చర్చించేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వాలని కోరారు.
ప్రివిలేజ్ కమిటీలో చర్చిద్దాం : మంత్రి శ్రీధర్ బాబు
ప్రొటోకాల్‌పై ఏదైనా సమస్య ఉంటే తర్వాత మాట్లాడుకుందామని, ఇప్పుడు చర్చను తెలంగాణ తల్లి విగ్రహానికే పరిమితం చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి లేచి ప్రొటోకాల్‌పై సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. 8 నెలల నుంచి చెబుతున్నా దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. దానిపై చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కల్పించుకొని..
ప్రొటోకాల్ విషయంపై ఇప్పటికే సీఎం, మంత్రి శ్రీధర్ బాబు తనకు చెప్పారని, వీలైతే తర్వాత తన చాంబర్లో కూర్చుని దానిపై మాట్లాడుదామని సూచించారు. శ్రీధర్ బాబు కూడా స్పందించి దీనిపై ప్రివిలేజ్కమిటీలో చర్చిద్దామని హామీ ఇచ్చారు. మైక్ కట్ చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. వచ్చిన ఐదుగురు సభ్యుల్లో ఇప్పటికే ముగ్గురు మాట్లాడేశారని, మెజారిటీ ఉన్న తమ పార్టీలోని సభ్యులు కనీసం నలుగురైనా మాట్లాడకుండా ఇంకెన్నిసార్లు మైకులు ఇవ్వాలని మండిపడ్డారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మైక్ ఇస్తామని స్పష్టం చేశారు.