ఆలేరులో కుంభ అనిల్ వర్సెస్  బీర్ల ఐలయ్య 

యాదాద్రి జిల్లా ఆలేరులో కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఆలేరులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన ‘పీపుల్స్ మార్చ్’ కార్నర్ మీటింగ్ లో నాయకుల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కుంభ అనిల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పీపుల్స్ మార్చ్ పేరుతో భట్టి చేపట్టిన పాదయాత్ర ఆలేరు నియోజకవర్గానికి చేరుకుంది. ఆలేరులో పాదయాత్ర చేసిన భట్టి.. అక్కడే కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

కార్నర్ మీటింగ్ లో సభాధ్యక్షుడిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జ్ బీర్ల ఐలయ్య మాట్లాడుతుండగా... తాను మాట్లాడుతానంటూ జిల్లా అధ్యక్షుడు కుంభ అనిల్ మైక్ తీసుకోబోయాడు. దీంతో రియాక్ట్ అయిన ఐలయ్య.. తాను సభాధ్యక్షుడినంటూ మైక్ ఇవ్వడానికి ససేమిరా అన్నారు. దీంతో కాసేపు ఇద్దరి మధ్య మల్లు భట్టి విక్రమార్క సమక్షంలోనే వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇదంతా గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళానికి గురయ్యారు.