- చితకబాదిన స్థానికులు
- ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాల ఆందోళన
సికింద్రాబాద్/పంజాగుట్ట , వెలుగు: సికింద్రాబాద్ పాస్‌పోర్టు ఆఫీస్దగ్గరున్న కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. సోమవారం తెల్లవారుజామున నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి గర్భగుడి తాళం పగలగొట్టి లోనికి చొరబడ్డాడు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. తర్వాత మోండా మార్కెట్ పోలీసులకు అప్పగించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నిందితుడిని మొదట గాంధీ హాస్పిటల్‌కు, తర్వాత పంజాగుట్ట నిమ్స్దవాఖానకు తరలించారు.
ఘటనను నిరసిస్తూ ఆలయ చుట్టుపక్కల వారు, బీజేపీ లీడర్లు, హిందూసంఘాలు, స్థానిక లీడర్లు ధర్నాకు దిగారు. కార్పొరేటర్లు కొంతం దీపిక, చీర సుచిత్ర స్థానికులతో కలిసి ఆలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. బీజేపీ లీడర్మాధవీలత ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీగణేశ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, బీజేపీ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ కోరారు. సిటీలో హిందూ దేవాలయాల ధ్వంసం వెనక భారీ కుట్ర దాగి ఉందని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి పగుడాకుల బాలస్వామి అనుమానం వ్యక్తం చేశారు. కుట్రల వెనుక ఏ శక్తి ఉన్నదో నిఘా సంస్థలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనం గుంపులుగా చేరడంతో చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో వారిని అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. సీపీ సీవీ ఆనంద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్, టాస్క్ఫోర్స్డీసీపీలు సుదీంద్ర, శ్రీనివాసులు సాయంత్రం వరకు అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. నిందితుడిని ముంబయికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో నగరానికి ఎందుకు వచ్చాడు? ఎందుకిలా చేశాడు? అన్నది తెలియరాలేదు. నిమ్స్వద్ద వెస్ట్జోన్డీసీపీ విజయ్‌కుమార్ పర్య వేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.