- దాడులు చేసుకున్న వివిధ పార్టీల లీడర్లు, కార్యకర్తలు
- లాఠీచార్జ్ చేసిన పోలీసులు
- డబ్బులు ఇవ్వలేదంటూ కొన్నిచోట్ల ఓటర్ల ఆందోళన
నెట్వర్క్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. కొన్ని పోలింగ్‌కేంద్రాల వద్ద నేతల ప్రచారాన్ని, డబ్బుల పంపిణీని ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో గొడవలు జరిగాయి. ఈ సందర్భంగా పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కొన్నిచోట్ల లాఠీచార్జ్ చేశారు. కాగా, మరికొన్ని చోట్ల డబ్బులు ఇవ్వలేదంటూ వివిధ పార్టీల లీడర్లను ఓటర్లు నిలదీశారు.
ఎక్కడెక్కడ ఏం జరిగిందంటే..
- మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లింగంపల్లి జీపీ పరిధిలోని బిట్ల తండాలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కొడుకు శశిధర్‌రెడ్డి కారుపై దాడి జరిగింది. పోలింగ్ కేంద్రం దగ్గర ఆయన ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బైక్‌లు అడ్డంపెట్టి, రాళ్లతో దాడి చేశారు. దీంతో శశిధర్ రెడ్డి కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలకు చెందిన బీఆర్ఎస్లీడర్లు లక్ష్మాపూర్ వచ్చి ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళన చేశారు. మెదక్ లోని గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీ పోలింగ్‌కేంద్రం దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ నేతలు తమపై దాడి చేశారని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తుండగా, బీఆర్ఎస్ వాళ్లే కాంగ్రెస్అభ్యర్థి రోహిత్ రావుభార్య శివాని వెహికల్ పై దాడి చేశారని కాంగ్రెస్‌నేతలు ఆరోపించారు.
- హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. గ్రామాన్ని రెవెన్యూ విలేజ్‌గా ప్రకటిస్తానని ఇచ్చిన హామీ ఏమైందంటూ నిలదీశారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేయగా వారితో బీఆర్ఎస్కార్యకర్తలు వాదనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
- ఓటర్లకు పంచాలని పంపిన డబ్బులను మధ్యలోనే నొక్కేశారని ఆరోపిస్తూ ములుగు జిల్లా మంగపేటలోని బీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై ఓటర్లు దాడికి యత్నించారు. ఇంటి తలుపులు తోసుకుని లోపలికి వెళ్లారు. దాంతో ఆ లీడర్ పరారయ్యారు.
- భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలం మైలారంలో తమకు ఓటేస్తామని డబ్బులు తీసుకుని కాంగ్రెస్‌కు వేస్తున్నారంటూ బీఆర్ఎస్కార్యకర్తలు 303 నెంబర్ బూత్‌లో ఓటర్లతో వాదనకు దిగారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. 304 పోలింగ్ బూత్‌లో క్యూలైన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్నాయకులు గొడవకు దిగగా, పోలీసులు వారిని చెదరగొట్టారు.
- హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ లోని పోలింగ్‌బూత్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయగా పోలీసులు వారిని పంపించేశారు. అయితే మళ్లీ తిరిగి రావడంతో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ పై ఎస్ఐ అశోక్కుమార్చేయి చేసుకున్నారు.
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట పోలింగ్‌బూత్‌కు వచ్చిన కాంగ్రెస్ క్యాండిడేట్ రామచంద్ర నాయక్ ను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుని, అతని డ్రైవర్ పై దాడి చేశారు. మరిపెడ జడ్పీ స్కూల్పోలింగ్ బూత్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సీతారాంపురంలోని బూత్‌లో ప్రచారం చేస్తున్నారన్న కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ కౌన్సిలర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు.
- జనగామలోని స్టేషన్ రోడ్డు ప్రభుత్వ పాఠశాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడగా పోలీసులు వారిని చెదరగొట్టారు. బీఆర్ఎస్క్యాండిడేట్పల్లా రాజేశ్వరరెడ్డి వెంట అపరిచిత వ్యక్తి వచ్చాడని ఆరోపిస్తూ అతనిపై విపక్ష లీడర్లు దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. జనగామ మండలం శామీర్‌పేట పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్, కాంగ్రెస్అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాపరెడ్డి ఎదురుపడగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల నాయకులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
- కరీంనగర్ జిల్లా గన్నేరువరంలోని పోలింగ్ కేంద్రంలోకి మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పింక్ అంగీ వేసుకుని వెళ్లగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం బయటికి పంపించారు.
- పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో బీఆర్ఎస్క్యాండిడేట్పంపిన డబ్బులు అందరికి ఇవ్వలేదని పోలింగ్బూత్దగ్గరే మహిళలు స్థానిక సర్పంచ్‌ను నిలదీశారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం ఆవునూర్ లో బీఆర్ఎస్ కార్యకర్త డబ్బులు పంచుతుండగా బీజేపీ లీడర్లు పట్టుకున్నారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
- మహబూబ్‌నగర్ శ్రీనివాస కాలనీలోని 100, 101 పోలింగ్ స్టేషన్ల దగ్గర టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ లీడర్లు దాడి చేశారు. మంత్రి ఆదేశాలతో మహేశ్ గౌడ్ తదితరులు తనపై దాడి చేశారని ఆయన పోలీసులకు కంప్లయింట్ చేశారు.
- నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వంకేశ్వరం, మన్ననూర్ గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అమ్రాబాద్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంకు ఇంక్ అంటిందని బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజు భార్య అమల ఆందోళనకు దిగారు. అధికారులు సర్దిచెప్పినా వినలేదు.
- నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని వర్కూరులో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 14 మంది కార్యకర్తలతో కలిసి 59, 60 పోలింగ్ స్టేషన్లలోకి రాగా.. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనంపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
- ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి స్కూల్ లో పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాగా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణ పడగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీరోలులో పంచాయతీ కార్యదర్శి కారు గుర్తుకు ఓటేయాలని చెబుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో అధికారులు ఆమెతో సారీ చెప్పించారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలింగ్బూత్వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ టైమ్ ముగుస్తుండగా వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావును సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలోనే రేగాను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రేగా తన అనుచరులతో పోలింగ్‌బూత్‌లోకి చొచ్చుకుపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
- ఆలేరు మండలం కొలనుపాక పోలింగ్ సెంటర్‌కు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత, ఆమె భర్త మహేందర్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మహేందర్‌రెడ్డి కారుపై రాళ్లు విసరడంతో అద్దం పగిలింది.
- ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ప్రభుత్వ బాలికల ప్రైమరీ స్కూల్ లోని 90 పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్మద్దతుదారైన ఇండిపెండెంట్క్యాండిడేట్సాంబశివ గౌడ్ఏజెంట్రిగ్గింగ్కు పాల్పడ్డాడని బీజేపీ, బీఎస్పీ నాయకులు నిరసనకు దిగారు. ఆర్డీవోకు కంప్లయింట్ చేస్తామని బీజేపీ అభ్యర్థి హరీశ్ బాబు వెళ్లిపోగా.. బీఎస్పీ నాయకులు మాత్రం అక్కడే కూర్చున్నారు.
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ కు చెందిన జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు నిరసనలో పాల్గొనడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు రాళ్లు, చెప్పులు విసురుకోగా ముగ్గురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. ఆందోళనతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం కష్టమైంది. పరిస్థితి అదుపులోకి వచ్చాక వాటిని తరలించారు.