చండీగఢ్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో శనివారం రాత్రి దారుణం జరిగింది. భారత విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో హర్యానాకు చెందిన నవజీత్ సంధు(22) అనే యువకుడు చనిపోయాడు. మరో స్టూడెంట్ గాయపడ్డాడు. ఈ కేసులో ఇద్దరు భారతీయ విద్యార్థుల ఆచూకీ కోసం విక్టోరియా పోలీసులు గాలిస్తున్నారు. మృతుడి బంధువు యష్వీర్ ప్రకారం.. "తాను ఉంటున్న ఇంటినుంచి వస్తువులు తెచ్చుకునేందుకు వెంట రావాలని నవజీత్ సంధును అతడి ఫ్రెండ్(మరొక భారతీయ విద్యార్థి) అడిగాడు. దాంతో ఇద్దరూ కలిసివెళ్లారు. తన ఫ్రెండ్ ఇంటి లోపలికి వెళ్లిన తర్వాత పెద్ద కేకలు వినిపించాయి. ఏదో గొడవ జరుగుతున్నదని, వారిని ఆపాలనే ఉద్దేశంతో నవజీత్ సంధు కూడా ఇంటి లోపలికి వెళ్లాడు. గొడవ పడొద్దని వారిని విడిపించే ప్రయత్నం చేశాడు.
అంతలోనే ఓ యువకుడు కత్తితో నవజీత్ సంధు ఛాతిలో పొడిచాడు. దాంతో అతను చనిపోయాడు. అతడిని ఇంటికి తీసుకెళ్లిన ఫ్రెండ్ కు కూడా గాయాలయ్యాయి" అని వెల్లడించారు. నవజీత్ సంధు చనిపోయినట్లు ఆదివారం ఉదయం తమకు సమాచారం అందిందని యష్వీర్ తెలిపారు.