- బాలుడిని చంపి.. బకెట్లో కుక్కి
- హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో దారుణం
- పిల్లాడి తండ్రితో ఆర్థిక వివాదాల కారణంగా చంపిన హిజ్రా ఇమ్రాన్
- గొంతు నులిమి హత్య..
- ఎముకలు విరిచి బకెట్లో కుక్కి ప్లాస్టిక్ సంచిలో ప్యాకింగ్
- ఆటో డ్రైవర్ సాయంతో నాలాలో డంపింగ్
- సీసీ కెమెరాలతో దొరికిన నిందితులు.. ఇద్దరు అరెస్టు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌లోని సనతనగర్లో దారుణం జరిగింది. 8 ఏండ్ల పిల్లాడిని ఓ హిజ్రా హత్య చేశాడు. బాలుడి తండ్రితో ఉన్న ఆర్థిక వివాదాల కారణంగా చంపేశాడు. సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఏరియా అల్లాదున్ కోఠిలో వసీంఖాన్ రెడీమేడ్ డ్రెస్సుల వ్యాపారం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డలు, కొడుకు వహీద్ ఖాన్(8)తో కలిసి అదే ఏరియాలో ఉంటున్నాడు. వసీంఖాన్ ఇంటికి సమీపంలోనే ఇమ్రాన్ అలియాస్ ఫిజాఖాన్ ఉంటున్నాడు. ఇమ్రాన్ మూడేండ్ల కింద జెండర్ మార్చుకొని హిజ్రాగా మారాడు. ఫిజాఖాన్‌గా పేరు మార్చుకున్నాడు.
ఇమ్రాన్ స్థానికంగా చిట్టీలు వేస్తున్నాడు. వడ్డీలకు అప్పులు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ వద్ద రెండుమూడేండ్ల కింద వసీంఖాన్ రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే అవి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. దీనికి తోడు ముంబైలో ఉండే వసీంఖాన్ బామ్మర్ది.. ఇమ్రాన్ దగ్గర రూ.5 లక్షల చిట్టీ వేస్తున్నాడు. దీంతో ఆ చిట్టీ ఎత్తి తనకు ఇవ్వాలని ఇమ్రాన్ ను కొంత కాలంగా వసీంఖాన్ అడుగుతున్నాడు. దీనిపైనా ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో తన కొడుకును చంపేస్తానని వసీంఖాన్ ను ఇమ్రాన్ పలుమార్లు బెదిరించాడు.
నమాజ్‌కు వెళ్లొస్తుండగా పిలిచి..
డబ్బుల విషయమై గురువారం కూడా ఇమ్రాన్, వసీంఖాన్ ల మధ్య గొడవ జరిగింది. దీంతో రంజాన్ వేళ వసీంఖాన్ ఇంట్లో ఎవరూ సంతోషంగా ఉండొద్దని ఇమ్రాన్ ప్లాన్ వేశాడు. వసీంఖాన్ కొడుకు వహీద్ ఖాన్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం కొడుకు వహీద్‌తో కలిసి వసీంఖాన్ మసీద్‌కు వెళ్లడం గమనించాడు. తిరిగి ఇంటికి వసీంఖాన్ ముందు వెళ్లగా, కొంతసేపటికి వహీద్ రావడం చూశాడు. ఇదే అదనుగా రాత్రి 7 గంటల టైమ్ లో ఇంటికి వెళ్తున్న వహీద్ ను ఇమ్రాన్ పిలిచాడు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ తెచ్చివ్వాలని పిల్లాడిని కోరాడు. దీంతో వహీద్ పక్కనే ఉన్న షాప్ కు వెళ్లి ఓఆర్‌ఎస్ తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత వహీద్ ను తన ఇంట్లోకి తీసుకెళ్లిన ఇమ్రాన్.. అతి దారుణంగా హత్య చేశాడు. మొదట గొంతు నులిమి, ఆ తర్వాత వైర్‌తో మెడకు బిగించి చంపేశాడు.
సీసీ కెమెరాలతో వెలుగులోకి..
నమాజ్ అయిపోయి చాలాసేపు అయినా వహీద్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. మసీద్ కు వెళ్లి చూడగా చెప్పులు మాత్రమే కనిపించాయి. దీంతో ఫ్రెండ్స్, బంధువుల ఇండ్లలో వెతికారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇమ్రాన్ కూడా స్థానికులతో కలిసి బస్తీలో తిరిగాడు. బస్తీవాసులంతా కలిసి స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఇమ్రాన్ ఇంటి నుంచి ఓ ఆటో డ్రైవర్ బ్యాగ్ తీసుకెళ్లడం గుర్తించారు. దీంతో అనుమానంతో ఇమ్రాన్‌ను నిలదీశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ముందుగా కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకొని విచారించి హత్యకేసు ఫైల్ చేశారు. ఇమ్రాన్ చెప్పిన వివరాలతో ఆటో డ్రైవర్ రఫీక్ ను అరెస్టు చేశారు. జింకలబావి నాలా వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వహీద్ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, నరబలి జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించగా, అలాంటిదేమీ లేదని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆర్థిక వివాదాలతోనే హత్య జరిగిందని నిర్ధారణకు వచ్చారు. బాధిత కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.
ఆటోడ్రైవర్‌కు చెత్త అని చెప్పి..
వహీద్ డెడ్ బాడీని ఇంట్లో నుంచి మాయం చేయాలని నిర్ణయించుకున్న ఇమ్రాన్.. ఎముకలన్నీ విరిచేసి డెడ్ బాడీని దగ్గరికి చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ బకెట్లో కుక్కాడు. ఆ బకెట్ ను ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేశాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు వహీద్ చెప్పులు తీసుకెళ్లి మసీద్ వద్ద పెట్టి వచ్చాడు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు తనకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ రఫీక్ ను ఇంటికి పిలిచాడు. రంజాన్ సందర్భంగా ఇల్లు మొత్తం క్లీన్ చేశానని, ఆ చెత్తను సంచిలో వేశానని చెప్పాడు. దాన్ని దూరంగా నాలాలో పడేసి రావాలని కోరాడు. దీంతో ఇమ్రాన్ ఇచ్చిన సంచిని తీసుకెళ్లిన రఫీక్.. దాన్ని బాలానగర్ జింకలబావి బస్తీలో ఉన్న నాలాలో పడేశాడు.