భూమి కోసం దారుణం బిడ్డ, అల్లుడిపై కత్తులతో దాడి

  • కూతురు అక్కడికక్కడే మృతి
  • అల్లుడు పరిస్థితి విషమం
  • రోడ్డుపై పరుగెత్తుతున్నా వదల్లేదు
  • పక్కింట్లో దాక్కుంటే వేటాడి చంపేశారు
  • ఖమ్మం జిల్లా తాటిపూడిలో ఘటన

వైరా, వెలుగు : భూమి కోసం కన్నబిడ్డ, అల్లుడు అని కూడా చూడకుండా కత్తులతో నరికి చంపేశారు. తల్లిదండ్రులు, సోదరులు కలిసి గడ్డపార, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో కూతురు అక్కడికక్కడే కన్నుమూసింది. అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు కొడుకులు నరేశ్​, వెంకటేశ్​తో పాటు కూతురు ఉష(35) ఉంది. ఉషను కొణిజర్ల మండలం గోపవరం గ్రామానికి చెందిన పరిసబోయిన రామకృష్ణకు ఇచ్చి పదిహేనేండ్ల కింద పెండ్లి చేశారు. అప్పటి నుంచి రామకృష్ణ ఇల్లరికం వచ్చి ఉంటున్నాడు. ఉష తాత మన్యం వెంకయ్య (అమ్మ తండ్రి) వీరిని చూసుకుంటున్నాడు. బతికి ఉన్నప్పుడు అతడి పేరిట ఉన్న మూడు ఎకరాలను ఉషకు రాసిచ్చాడు. భూమి మాత్రం రాములు, మంగమ్మ ఆధీనంలోనే ఉన్నా ఉషకు రిజిస్ట్రేషన్​ చేయడాన్ని  వారు సహించలేకపోయారు. ఈ విషయంలో వెంకయ్యతో రెండు మూడు సార్లు గొడవ కూడా పెట్టుకున్నారు. మూడేండ్ల కింద వెంకయ్య కన్నుమూశాడు.

అయితే తన తండ్రి భూమి తనకే చెందుతుందని మంగమ్మ కోర్టుకు వెళ్లింది. కేసు ఇంకా నడుస్తోంది. ఈ క్రమంలో కోపంతో ఉన్న మంగమ్మ, రాములు, వీరి ఇద్దరి కొడుకులు ప్లాన్​ వేసుకున్నారు. శుక్రవారం అందరూ కలిసి పనికి పోతున్నట్టుగా కత్తులు, గడ్డపారలు పట్టుకుని ఉష ఇంటికి వచ్చారు. మాట్లాడుతూనే భూమి విషయమై గొడవ పెట్టుకున్నారు. ఒకేసారి నలుగురూ ఉష, రామకృష్ణపై కత్తులు, గడ్డపారలతో దాడికి దిగారు. షాక్​కు గురైన వారు రోడ్డుపైకి పరిగెత్తారు. అయినా వదలకుండా వెంటపడి కత్తులతో పొడిచారు. ఉష వారి నుంచి తప్పించుకుని పక్కింట్లోకి  వెళ్లి దాక్కున్నా వదిలిపెట్టలేదు. ఇంట్లోకి వెళ్లి మరీ కత్తితో తలపై బాది గడ్డపారతో పొడిచి చంపేశారు. ఇదంతా జనం చూస్తున్నా అడ్డుపడితే తమనూ చంపుతారనే భయంతో కాపాడే ధైర్యం చేయలేదు. రోడ్డుపై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణను స్థానికులు ఖమ్మం గవర్నమెంట్ ​హాస్పిటల్​కు, అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​కు తీసుకువెళ్లారు.  సంఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ రహమాన్, సీఐ సాగర్ ఎస్సై మేడ ప్రసాద్ పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితులు పోలీసులకు లొంగిపోయారు.