కులవాదాన్ని పోషిస్తూ సనాతనంపై దాడి

కులవాదాన్ని పోషిస్తూ సనాతనంపై దాడి

తమిళనాడు ప్రోగ్రెసివ్​ రైటర్స్​ అసోసియేషన్​ సెప్టెంబరు2న చెన్నైలో ఏర్పాటు చేసిన సనాతన నిర్మూలన సమ్మేళనంలో ఉదయనిధి స్టాలిన్​ ‘డెంగ్యూ, కరోనా లాగే సనాతనాన్ని నిర్మూలించాలి’ అని అన్నాడు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా కులవాదులను చాలా మందిని పిలిచారు. ప్రొ. ఇళంగో రాసిన ‘సనాతన ఐడియాలజీ ఇంపోజిషన్​ అండ్​ రెసిస్టెన్స్​ ఇన్​ తమిళనాడు’ అనే పుస్తకం ఆవిష్కరణ కూడా పెట్టుకున్నారు. ఈ సభలో మధుమార రామలింగం(సీపీఐ), పీటర్​ ఆల్ఫోన్స్​(కాంగ్రెస్​) వంటి వారు కూడా పాల్గొని ప్రసంగించినట్లు తెలుస్తోంది. నుపుర్​శర్మ ఒక మత ప్రవక్తను దూషించిందని విదేశాల్లో సైతం రాయబార కార్యాలయాలు స్పందించాయి.

కానీ ఉదయనిధి వ్యాఖ్యలపై హిందూ సంస్థలు, బీజేపీ మాత్రమే స్పందన వ్యక్తం చేయగా మిగతావారు సగం అటు, ఇటుగా తమ భాష్యం చెప్పుకొచ్చారు. వెనువెంటనే ఉదయనిధి కుటుంబం మాత్రం ఆయన గొప్ప భాష్యాకారుడని, సనాతనంపై తన యుద్ధం కొనసాగుతుందనీ వెనుకేసుకొచ్చారు. అయితే ‘కులవాదులు–పిడివాదులు’ సనాతనధర్మంపై అక్కసు వెళ్లగక్కడం, కులవాదం పెంచి పోషించి రాజకీయ పబ్బం గడుపుకోవడం ఇటీవల గమనించదగ్గ విషయం.

తమిళనాడు రాజకీయం కులాల కుంపట్లపై నడుస్తోందని చరిత్ర చెప్పిన విషయం. త్యాగరాయ చెట్టియార్, ముత్తయ్య మొదలియార్, ఇవి రామస్వామి నాయకర్, తనికాచలం చెట్టియార్, సీఎన్​అన్నాదురై, కె. కామరాజ్, కరుణానిధి.. వంటి వారెందరో అక్కడ కుల ఉద్యమాలు నడిపారు. ఇందులో బ్రాహ్మణ వ్యతిరేకత నరనరాన నింపుకున్న పెరియార్​ రామస్వామి తనకు వ్యక్తిగతంగా జరిగిన అవమానంను కుల వ్యతిరేకతగా మార్చుకున్నాడు. 1931లోనే కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను తమిళంలోకి అనువదించిన పెరియార్ ​హిందూ ధర్మంపై పట్టరాని కోపం పెంచుకున్నాడు. తన పోరాటానికి ద్రావిడ ముసుగు తగిలించి ఉత్తర భారత వ్యతిరేక దృక్పథం, ద్రవిడిస్తాన్​ఏర్పాటు, హిందీవ్యతిరేక ఉద్యమం, గాంధీ చిత్రపటాలు తగలబెట్టడం,  బ్రాహ్మణులపై వ్యక్తిగత దాడులకు పూనుకోవడం వంటివి చేశాడు. ఆఖరుకు 1944లో ద్రవిడిస్తాన్​ కావాలంటూ బ్రిటీష్​వారిని ఒప్పించేందుకు జస్టిస్​పార్టీ వృద్ధనేత పన్నీర్​సెల్వంను బ్రిటన్​కు పంపగా ఆయన మధ్యలో విమానంలో మరణించాడు. ఇదే మార్గంలో జస్టిస్​పార్టీని ‘ద్రవిడ కజగం’గా మార్చిన పెరియార్ బాటలోనే కరుణానిది నడిచాడు. కానీ అతని కుటుంబాన్ని ఆస్తికత్వం నుంచి నాస్తికులుగా మార్చలేకపోయాడు. కరుణానిధికి కూడా 2016లో గోపాలపురంలోని ఆయన ఇంట్లో టీటీడీ అర్చకులు వేదాశీర్వచనం తెలిపారు. శ్రీమద్రామానుజుల జీవితంపై కరుణానిధి రాసిన సీరియల్​ తమిళనాట ప్రాచుర్యం పొందింది. పెరియార్ ​ఇంత నాస్తికత్వ ఉద్యమాలు నడిపినా ఆయన భార్య నాగమ్మాళ్ ​గొప్ప భక్తురాలు. కొందరు చేసే ఈ ప్రయత్నాన్ని తమిళులు ఎన్నడూ నమ్మలే. అందుకే నేటికీ తమిళనాట సనాతనం సజీవంగా మరింత వృద్ధిలోకి వచ్చింది. ఉదయనిధి ఓటు మంత్రాలకు, సనాతనం నిర్మూలన అనేది ఒట్టి మాట.

దీనికి కులాల తరఫున వకాల్తా పుచ్చుకొని ‘సమానత్వం’ అన్న ముసుగును తగిలిస్తారు ఈ పిల్ల స్టాలిన్​ తాతగారు. ఆయన పార్టీ, ఓ మహిళ అనికూడా చూడకుండా జయలలిత వస్త్రాపహరణం చేయడం కూడా వీళ్ల సమానత్వమేనా?  కుటుంబం ఏలుబడిలో 2జీ, 3జీలు చేసి వేల కోట్లలో  దేశాన్ని దోచేసి సిద్ధాంతాల ముసుగులో దాక్కోవడం హిపోక్రసీ కాదా?  కులాల పంచాయితీ పోషిస్తున్నదీ ఈ కుటుంబాలు కాదా? అయినా స్టాలిన్ కు ​తాను ఆచరించే క్రైస్తవంలో కన్నా సనాతనంలోనే సంస్కర్తలు పుట్టుకొచ్చిన విషయం తెలియకపోతే ఎలా? 5వ శతాబ్దంలోనే ఆళ్వార్లు, నయనార్లు, రామానుజులు తమిళనాడులోనే కదా! ఆ పక్కనున్న మలయాళ దేశంలో నారాయణ గురు చేసిన సంస్కరణ హిందూ మతంలోనే కదా! సనాతనం కాకుండా ఇతర ఏ మతం మెజార్టీగా ఉన్న దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సర్​తన్ ​సే జుదా జరిగేది కాదా? ‘పెద్దదైన కరుణానిధి కుటుంబ రాజకీయాల్లో ఉదయనిధికి పెద్ద పాత్ర వేయించేందుకే ఈ కొత్త డ్రామా’ అని తమిళ పత్రికల్లో రాస్తున్నారు. మరోవైపు అన్నామలై పాదయాత్ర కూడా జూనియర్​ స్టాలిన్​ను కలవరపెడుతోంది.

సామాజిక న్యాయం ముసుగులో చేస్తున్న సనాతన ధర్మంపై దాడి సూర్యుడిపై ఉమ్మేయడమే. గతంలో కమల్​హాసన్, మణిశంకర్​అయ్యర్, సీతారం ఏచూరి,  కొడియేరి బాలకృష్ణన్ ఇలాగే తిట్టారు. వాళ్ల వ్యక్తిగత ప్రతిష్టను పెంచడంలో కూడా సనాతన ధర్మానిదే పాత్ర. సనాతన ధర్మం ఏంటో తెలియాలంటే ఆ పక్కనే పుట్టిన ఆదిశంకరులను చదవకున్నా పర్లేదు కానీ.. కనీసం మాక్స్​ముల్లర్​ రాసిన ‘వాట్​ ఇండియా కెన్​టీచ్​అస్​’ అయినా చదివితే చాలు. 

పెద్దజీయర్​ను, చినజీయర్​ మరిచారా?

ఉదయనిధి లాంటి వారికి బుద్ధిచెప్పాల్సినచినజీయర్​ స్వామి చేసిన విచిత్రమైన వ్యాఖ్యలు కలవరం కలిగిస్తున్నాయి. ఇటీవల జనగామ జిల్లా వల్మిడి గ్రామంలోని సీతారామచంద్ర ఆలయం పున:ప్రారంభంలో జీయర్​ స్వామి చేసిన ‘కుల వ్యాఖ్యలు’ కలకలం రేపుతున్నాయి. స్వామి ఉద్దేశం ఏమిటో కానీ.. చిన్న స్టాలిన్ ​వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ‘కులాలు అలాగే ఉండాలని, ఎవరి పని వాళ్లు చేయాలని’ వాటి సారాంశం. తమిళనాడులో 1955, 1968ల్లో పెరియార్, తన అనుచరులు హిందూ వ్యతిరేక ఉద్యమం చేశారు. రామాయణం పై  చాలా నీచంగా రాశారు.రాముడి బొమ్మలను తగలబెట్టించారు. ఆ సమయంలో పెద్దజీయర్​స్వామి తమిళనాడుకు వెళ్లి రామ విగ్రహధ్వంసం జరిగిన చోట రామాయణ సప్తాహం చేసి వచ్చాడు.

ఆ సంప్రదాయంలో పీఠాధిపతి అయిన చినజీయర్ ​స్వామి.. మంత్రులు హరీశ్​రావు, దయాకర్​రావు, ఇంద్రకరణ్ ​రెడ్డి, సత్యవతి రాథోడ్​ల సమక్షంలోనే ‘కులం’పై చేసిన వ్యాఖ్యలు కులవాదులకు బలం ఇస్తున్నాయి. హిందూ మతాన్ని తిట్టిపోసేవారికి కొత్త అస్త్రాలను అందిస్తున్నాయి. దేవాలయం అందరికీ సమాన స్థానం ఇచ్చేది అని చెప్పే క్రమంలో చినజీయర్​ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఇప్పుడు కులం విషయంలో జరుగుతున్న సంస్కరణలు, పట్టింపులోని విధానం ప్రజల్లో సహజంగా వస్తున్న కొత్త పరిణామాలు.

ఆళ్వార్లు మొదలుకొని అంబేద్కర్​వరకు చెప్పిన సైద్ధాంతిక భూమికతోపాటు ప్రజల విచక్షణ సరికొత్త దృక్పథం వైపు తీసుకువెళ్తున్నది.కుల పట్టింపులు  తగ్గాయి, ఓటు రాజకీయాల కోసం మాత్రమే బతికున్నాయి.  ఈ మాత్రమైనా తెలియని చినజీయర్​తో సనాతన ధర్మానికి జరుగుతున్నది మేలని ఎలా అనుకోవచ్చు?

చివరగా..

ఉదయనిధి స్టాలిన్​ తన రాజకీయ ప్రస్థానం సుస్థిరం చేసుకునేందుకు సనాతన ధర్మంపై దాడిచేస్తుంటే..తెలంగాణలో అధికారం కోసం కులాలను వంతెనగా వాడుకుంటున్న పాలకుడిసేవలో చినజీయర్ కులాలే సనాతనం అంటున్నారా? అది సనాతన ధర్మం ఎలా అవుతుంది? కాల భైరవుడు

ధర్మం నిర్మూలన సాధ్యమా?

మతాలకు ప్రవక్తలు, గ్రంథాలు, ఒకే దేవుడు ఉంటాడు. కానీ సనాతనం ఒక ధర్మం. అది జీవన విధానం. అది ఆద్యంతాలు లేనిది. సనాతన ధర్మానికి ఆయువుపట్టు వేదాలు. అందులో జ్ఞాన, కర్మ, ఉపాసనకాండలుగా తత్వదర్శనం మానవుని ఆత్యంతిక లక్ష్యంగా రుషులు దర్శించారు. ఇప్పుడు ఉదయనిది మాట్లాడినా, మణిశంకర్​ అయ్యర్​ మాట్లాడినా వాళ్ల పరిజ్ఞానంలోని పరిధి అంతే. సృష్టి ఆరంభంలో ఈ బ్రహ్మాండం ఎలా నిరామయంగా ఉండేదో చెప్పే ‘నాసదీయ సూక్తం’  లోతులు ఈ జూనియర్​ స్టాలిన్​కు ఎలా అర్థమవుతాయి? పురాణపాత్రలు మానవ మనస్సును ఎలా ప్రభావితం చేస్తాయో.. కులవాదులకు ఎలా అర్థం అవుతాయి?

కాలం వెంట వెనక్కి వెళ్లి బ్రహ్మకాలం సృష్టించి లిప్తలతో సహా లెక్కలు చెప్పిన మహర్షుల మేధో పరిజ్ఞానం వీళ్లకు అర్థమవుతాయా? శిష్యుడి ప్రశ్నలతోనే ప్రబోధం మొదలుపెట్టే ఉపనిషత్తుల పరిజ్ఞానం ఈ ఉష్ట్రపక్షులకు ఎలా తెలపాలి? క్రీ.శ 712లో మహ్మద్​బిన్ ​కాశీం మొదలు కొని 1947 వరకు పాలించిన లార్డ్​మౌంట్​బాటన్​ దాకా వెయ్యేళ్లలో సాధ్యం కాని ‘సనాతన నిర్మూలన’ ఈ పిల్లకాకులు చేస్తారా? అయితే అందరూ ఈ నమ్మకంతోనే మౌనంగా ఉన్నారన్న విషయం వాళ్లకూ తెలుసు.

‘సమతామూర్తి’ సందేశమేంటి ? 

చిన్నజీయర్​ స్వామిని గురువుగా భావించే తెలంగాణ ప్రభుత్వం కూడా కుల గురుకులాలు, కుల భవనాల నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వాటిని శాశ్వతం చేయాలనుకుంటున్నది. ఉదయనిధి స్టాలిన్​లాగే ఇక్కడ కేటీఆర్ ​కూడా నాస్తికుడని చెప్తారు. మరి కేసీఆర్ ​మాత్రం ఆయత చండీయాగాలు నిర్వహిస్తారు. హిందుగాళ్లు బొందుగాళ్లు అంటారు. అలాగే జీయర్​స్వామి ‘సమతామూర్తి’ పేరుతో శ్రీమద్రామానుజులకు పెద్ద విగ్రహం పెట్టి కులాలు అలాగే ఉంటాయనడం ఎంత వరకు సబబు? ‘కులం పునాదులపై ఒక జాతినీ, నీతిని నిర్మించలేరు’ అన్న బాబాసాహెబ్​ అనుచరులు సైతం తెలంగాణలో కులంపై తమ రాజకీయాలు నిర్మిస్తున్నారు.

ఇక్కడ శిష్యుడు అధికారం నిలుపుకునేందుకు గురువు కులాలకంపును అలాగే  కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా చినజీయర్​ కులాలే ధర్మం అనడం, రామానుజుల సమాతా సందేశానికే పూర్తి విరుద్ధం.  ధర్మాన్ని కాపాడటమంటే, పాలకుడి ప్రాపకాన్ని కాపాడుకోవడం కాదు. ఇలాంటి స్వాముల స్వార్థ కార్యాల వల్లే  ఉదయనిధి స్టాలిన్లు అక్కడక్కడా నోరుపారేసుకోగలుగుతున్నారని ఎందుకు అనుకోకూడదు? 

-‌‌ కాల భైరవుడు