కరెంటు బిల్లు అడిగేందుకు వెళ్లిన సిబ్బందిపై దాడికి యత్నం

  • కర్రతో యువకుడి వీరంగం

భైంసా, వెలుగు: విద్యుత్ బకాయిలు అడిగేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై ఓ యువకుడు దాడికి యత్నించిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగింది. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఫిల్టర్ బెల్ట్ ఏరియాకు చెందిన ఓ ఇంటి యజమాని మోహిన్​ ఏడాది కాలంగా విద్యుత్ బకాయిలు కట్టడంలేదు. రూ.20 వేలకు పైనే పెండింగ్​లో ఉంది. 

దీంతో విద్యుత్ సిబ్బంది మంగళవారం ఆ ఇంటికి కరెంటు సరఫరా నిలిపివేసేందుకు వెళ్లారు. అయితే, యజమాని మోహిన్ విద్యుత్ అధికారులపై కర్రలతో దాడికి యత్నించగా.. సుధాకర్​అనే సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నాడు. కాలనీవాసులు కలుగజేసుకొని అతడిని అడ్డుకున్నారు. తమ ఇంట్లోకి ఎలా వస్తారంటూ మోహిన్ వీరంగం సృష్టించాడు. విద్యుత్ అధికారులు సదరు వ్యక్తిపై పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎల్.శ్రీను తెలిపారు.