- అసంతృప్త నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం
- చిన్నా పెద్ద లీడర్లను కలిసి మద్దతు కోరుతున్న వైనం
హనుమకొండ, వెలుగు : కారు దిగి కాంగ్రెస్లో చేరి, తన కూతురు కావ్యకు వరంగల్ టికెట్ఇప్పించుకున్న కడియం శ్రీహరి.. ఇప్పుడు ఆమెను గెలిపించుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఇప్పటికే లెఫ్ట్పార్టీలు, దళిత సంఘాల మద్దతు కూడగట్టిన కడియం, కాంగ్రెస్లో కావ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి శ్రీహరిని కాంగ్రెస్లోకి తీసుకోవడాన్ని స్టేషన్ ఘన్పూర్లో శనిగపురం ఇందిర తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో టికెట్రాగానే తన కూతురు కావ్యతో కలిసి ఇందిర మద్దతు కోరారు.
తర్వాత వరుసగా జిల్లా మంత్రి కొండా సురేఖ, పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు పార్టీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ పెద్దరికం ప్రదర్శించే కడియం.. కూతురు కోసం ఓ మెట్టు దిగడంతో కాంగ్రెస్లో సానుకూల వాతావరణం కనిపిస్తోందని చర్చ జరుగుతోంది.