హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు, విలన్లు వీపుకి చిన్న సిలిండర్ తగిలించుకుని గాలిలోకి దూసుకెళ్లే సీన్లు చూస్తుంటాం. అలాంటివి రియాలిటీలోనూ సాధ్యం కాబోతున్నాయి. ఎవరైనా సరే అలా రెక్కలు కట్టుకుని గాలిలో ఎగురుతున్న ఫీలింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి కాప్టర్‌ప్యాక్ అనే సోలో ‘బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్’ను డెవలప్ చేసింది. తొలిసారిగా నిర్వహించిన దీని టెస్ట్ రన్ సక్సెస్ అయింది. ఓ యువకుడు ఈ కాప్టర్‌ప్యాక్‌ను వీపుకు కట్టుకుని 50 అడుగుల ఎత్తులో ఎగిరి, కొన్ని నిమిషాల తర్వాత సాఫీగా ల్యాండ్ అయ్యాడు.
తొలి దశ ట్రయల్స్‌లోనే..
కాప్ట్‌ప్యాక్ టెస్ట్ రన్‌కు సంబంధించిన 67 సెకన్ల వీడియోను ఆ సంస్థ యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఇందులో ఓ యువకుడు కాప్టర్‌ప్యాక్‌ను తగిలించుకుని, మెషీన్ ఆన్ చేసి 50 అడుగుల ఎత్తులో కొన్ని సెకన్ల పాటు ఎగిరాడు. ఆ తర్వాత అతడు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. గత ఏడాదిలో బ్యాక్‌ప్యాక్ హెలికాప్టర్ డెవలప్ చేయాలన్న ఆలోచన వచ్చిందని, ప్రత్యేకంగా ఉండాలని కరెంట్‌తో నడిచేలా తయారు చేశానని కాప్టర్‌ప్యాక్‌ను తయారు చేసిన మ్యాట్ తెలిపారు. ఇది ప్రస్తుతం తొలి దశ ట్రయల్స్‌లోనే ఉందని, ఫస్ట్ టెస్ట్ రన్ విజయవంతం కావడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే దీనిలో మరిన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని చెప్పారు. ‘హ్యాండ్ జాయ్ స్టిక్‌ను ఆపరేట్ చేయడం ద్వారా కాప్టర్‌ప్యాక్‌ను ఎటువైపు కావాలంటే అటు వైపు డ్రైవ్ చేసుకోవచ్చు. అయితే అది ఎగరాల్సిన హైట్‌కు వెళ్లే వరకు ఆటో పైలట్ మోడ్‌లోనే ఉంటుంది’ అని తెలిపారు. ఇది తక్కువ ఎత్తులో ఎగిరేలా డిజైన్ చేయడం వల్ల సేఫ్టీ విషయంలో పెద్దగా భయం లేదని, హెల్మెట్, స్పెషల్ సేఫ్టీ సూట్ తయారు చేయడం ద్వారా మరింత భద్రత పెరుగుతుందని మ్యాట్ అన్నారు. అయితే దీని స్పీడ్, బ్యాటరీ ఎంత సేపు చార్జ్ చేయాలి, ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెట్టాక ఎన్ని గంటలు పని చేస్తుంది, ఎంత దూరం ప్రయాణించవచ్చు, గాలి ఉండగా బ్యాటరీ అయిపోతే పరిస్థితి ఏంటి అన్న వివరాలను వెల్లడించలేదు.
గతంలో హైస్పీడ్ జెట్‌ప్యాక్స్ ఫెయిల్యూర్
సోలో బ్యాక్‌ప్యాక్ హెలికాప్టర్లను తయారు చేయాలని గతంలో దుబాయ్, చైనా, న్యూజిలాండ్‌కు చెందిన కంపెనీలు ప్రయత్నించాయి. వాటిని తయారు చేయగలిగినా.. పనితీరు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. వాటిలో ఏ ఒక్కటీ ట్రావెల్ కోసం పని కొచ్చేలా డిజైన్ చేయలేదు. కేవలం అడ్వెంచర్స్ కోసమే అన్నట్టు తయారు చేయడం, ట్రైనింగ్ టైమ్‌లో ఓ వ్యక్తి మరణించడం వంటి ఘటనలతో అవి మార్కెట్‌లోకి రాలేదు. 2020లో జెట్‌మ్యాన్ దుబాయ్ కంపెనీ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే జెట్ బ్యాక్‌ప్యాక్‌ను తయారు చేసింది. ఇది 20 వేల అడుగుల ఎత్తు వరకూ వెళ్లగలదు. జెట్ ఫ్యూయల్‌తో పని చేసే ఇంజన్లు ఉండడం వల్ల అంత ఎత్తుకు వెళ్లడం సాధ్యమైంది. కానీ ఫ్యూయల్ అత్యంత వేగంగా అయిపోవడంతో పై నుంచి ల్యాండింగ్‌కు ప్యారాచూట్ వాడేలా జెట్‌మ్యాన్ రూపొందించారు. దీని టెస్ట్ రన్ టైమ్‌లో ల్యాండింగ్ సక్సెస్ ఫుల్‌గా జరిగినా.. ఆ తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన విన్స్ రాఫెట్ అనే యువకుడి ట్రైనింగ్ సమయంలో గాలిలో ఉండగా ప్యారాచూట్ తెరుచుకోకపోవడంతో మరణించాడు. గతేడాది నవంబర్‌లో ఈ ఘటన జరగడంతో వాటిని ఆపేశారు. అలాగే 2020 ఆగస్టులో న్యూజిలాండ్‌కు చెందిన జెట్‌ప్యాక్ ఏవియేషన్ కంపెనీ ఇలాంటి హైస్పీడ్ జెట్‌ప్యాక్‌ను తయారు చేసింది. ట్రయల్స్ సక్సెస్ అయినా.. ఇది కూడా ఫ్యూయల్ సమస్యతోనే వెనుకడుగేసింది. ఆ తర్వాత అక్టోబర్‌లో చైనా, డిసెంబర్‌లో అమెరికా కంపెనీలు తయారు చేసినా ఇదే రకమైన సమస్యలను ఫేస్ చేశాయి.
కరెంట్‌తో నడిచే 2 ఫ్యాన్లు..
ఆస్ట్రేలియాకు చెందిన కాప్టర్‌ప్యాక్ కంపెనీ అదే పేరుతో ఈ సోలో బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్‌ను తయారు చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ లాంటి వాటితో కాకుండా కరెంట్‌తో పని చేస్తుంది. డ్రోన్ లాంటి మెకానిజంతోనే ఈ కాప్టర్‌ప్యాక్ గాలిలో ఎగురుతుంది. దీనిలో రెండు వైపులా రోటార్ ఫ్యాన్లు ఉంటాయి. కామన్ సపోర్ట్‌గా ఉండే లెదర్ బ్యాక్ ప్యాక్ సాయంతో తగిలించుకోవచ్చు. చేతులు పెట్టుకునేలా ముందు వైపు ఆర్మ్ రెస్ట్, దానికే ఆపరేటింగ్ జాయ్ స్టిక్ ఉంటాయి. రోటార్స్ ఒక్కొక్కటి మూడడుగుల వెడల్పు ఉంటుంది. హ్యాండ్ కంట్రోల్స్ భాగంలోనే చిన్న చిన్న బ్యాటరీలు ఉంటాయి. అయితే ఎక్కువ బరువు లేకుండా ఉండేందుకు లైట్ వెయిట్ మెటల్స్ వాడారు.