- మూడేండ్లలో 587 ఫోక్సో, రేప్ కేసులు నమోదు
- మహిళలు, మైనర్లపై వేధింపులు, లైంగిక దాడులు
- టెక్నాలజీతో పాటే పెరుగుతున్న క్రైం రేట్
మహబూబ్‌నగర్, వెలుగు : మహిళలు, మైనర్లపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. 2020తో పోలిస్తే 2022లో రేప్, ‘ఫోక్సో’ కేసులు డబుల్ అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో సగటున నెలకు ఇలాంటి కేసులు 20 వరకు ఫైల్అవుతున్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ క్లాసుల పేరుతో ఆరో తరగతి నుంచే పిల్లలకు సెల్ఫోన్లు కొనివ్వడం.. సెవెన్త్ క్లాస్ నుంచే స్టూడెంట్లు ప్రేమ పేరుతో అట్రాక్ట్ కావడం.. వీడియో కాల్స్ మాట్లాడటం లాంటి కారణాల వల్ల ఇలాంటి కేసులు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
టెక్నాలజీతో పాటే..
జిల్లాలో మూడేళ్లలో రేప్, ఫోక్సో కేసులు 587 నమోదు అయ్యాయి. ఇందులో ఫోక్సో కేసులు 2020లో 77 ఉండగా, 2021లో 122, 2022లో 127 కేసులు నమోదయ్యాయి. రేప్ కేసులు 2020లో 65 ఉండగా, 2021లో 92, 2022లో 104 ఫైల్ అయ్యాయి. అయితే పెరుగుతున్న టెక్నాలజీ వల్లే మహిళలు, మైనర్లపై అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నాయి. కొవిడ్ లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడంతో ఆరో తరగతి నుంచే స్టూడెంట్ల పేరెంట్స్ సెల్ఫోన్లు చేతికివ్వడంతో వారు మొబైల్స్‌ను మిస్ యూజ్చేస్తున్నారు. పిల్లలు బెడ్ రూమ్‌లలో కూర్చొని క్లాసెస్ వింటున్నారా? వీడియో కాల్స్ మాట్లాడుతున్నా? సోషల్ మీడియాలో ఉంటున్నారా? అనేది తల్లిదండ్రులు పరిశీలించడం లేదు.
అడ్వాన్స్ అయిపోతున్నారు..
ఐదేళ్ల కిందటి వరకు ఇంటర్, డిగ్రీ చదివే స్టూడెంట్లు ఎక్కువగా లవ్‌కు అట్రాక్ట్అయ్యే వారు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్కూలింగ్స్టేజీలోనే పెరుగుతున్న టెక్నాలజీతో పాటు అడ్వాన్వ్అవుతున్నారు. 7, 8, 9వ తరగతి పిల్లలు ఫ్రెండ్స్, లవర్స్‌ను మెయిన్టెయిన్చేస్తున్నారు. వీరిని అట్రాక్ట్ చేస్తున్న యువకులు లవ్ అని నమ్మించి రిలేషన్లో ఉంటున్నారు. అమ్మాయిల పర్సనల్ ఫొటోలను షేర్ చేయించుకుంటున్నారు. వీడియో కాల్స్ మాట్లాడి వాటిని రికార్డ్ చేస్తున్నారు. అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాక.. తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పర్సనల్‌గా షేర్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. వీటికి భయపడి అమ్మాయిలు అలాగే రిలేషన్షిప్కంటిన్యూ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా బయటకు రావడం లేదు. డూ ఆర్ డై పరిస్థితులున్నప్పుడే యువతులు తల్లిదండ్రులకు విషయాలను చెబుతున్నారు. దీనిపై బాధితులు పోలీస్ స్టేషన్లకు వస్తున్నా.. అమ్మాయిల తల్లిదండ్రులు కేసులు చేయొద్దంటూ పోలీసులను వేడుకుంటున్నారు.
‘బ్యాడ్ టచ్-గుడ్ టచ్’పై అవగాహన
మూడేళ్ల కిందటి వరకు షీ టీంలు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రతి ఆరు నెలలకోసారి ‘ బ్యాట్ టచ్-గుడ్ టచ్’ గురించి యువతులకు అవగాహన కల్పించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆరో తరగతి నుంచే పిల్లలకు దీని గురించి అవగాహన కల్పిస్తున్నారు. స్కూళ్లకు వెళ్లేటప్పుడు ఆటో డ్రైవర్లు, స్కూల్ బస్సు డ్రైవర్లు, ఇంట్లో ఉండే టైంలో పక్క ఇండ్లలో ఉండే అంకుల్స్, యువకులు, క్లాస్ రూమ్‌లలో ఉన్నప్పుడు టీచర్లు చేస్తున్న వెకిలి చేష్టలను ఎలా గుర్తించాలనే దానిపై సదస్సుల ద్వారా వివరిస్తున్నారు.
ఉమెన్స్‌డే రోజు పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 9న మండలంలోని ఓ స్కూళ్లో నాలుగో తరగతి బాలికను అదే ప్రాంతానికి చెందిన మైనర్.. పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. స్థానికులు ఈ విష యాన్ని పోలీసులకు తెలుపగా, నింది తుడిపై ‘ఫోక్సో’ కేసు ఫైల్‌చేశారు.
ఈ నెల 2 అర్ధరాత్రి ఉమ్మడి బాలానగర్ మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన బాలికను ముగ్గురు యువకులు వేధించారు. మనస్తాపంతో ఆ బాలిక మరుసటి రోజే ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. దీనిపై పోలీసులు ముగ్గురు యువకులపై ‘ఫోక్సో’ కేసు ఫైల్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
అవేర్నెస్ కల్పిస్తున్నాం
లవ్ అనగానే టీనేజర్లు త్వరగా అట్రాక్ట్ అవుతారు. వారికి చట్టం గురించి అవగాహన ఉండదు. షీ టీమ్స్ ద్వారా స్కూళ్లు, కాలేజీల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం. ‘బ్యాడ్ టచ్- గుడ్ టచ్’ గురించి వివరిస్తున్నాం. మా వద్దకు వస్తున్న ప్రతి కేసును పరిష్కరిస్తున్నాం.
- హనుమప్ప, సీఐ, మహబూబ్‌నగర్