- టెకీలపై ఈసీ ఫోకస్..
- సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ కు అవేర్ నెస్ ప్రోగ్రామ్స్
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులపై దృష్టి పెట్టింది. ప్రతి ఎన్నికల్లో టెకీలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని భావిస్తుంది. ఈసారి ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తమ ఆఫీసుల్లోనే ఓటు హక్కు, ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువపై ప్రచారం చేయనుంది. త్వరలోనే దీనిని అమల్లోకి తేనున్నట్టు ఎన్నికల సంఘం ఉన్నతాధికారి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కొంతైనా చైతన్యం వస్తే ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటారని పేర్కొన్నారు.
ప్రత్యేక దృష్టి
సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిలో పని చేసే చాలా మంది టెకీలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తేలింది. పోలింగ్ రోజున సెలవు ఇస్తుండగా.. షికార్లు, ఊర్లకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పోలింగ్బూత్కు వెళ్లి ఓటు వేసేవారు తక్కువగా ఉంటున్నారు. సిటీలో వివిధ కంపెనీల్లో పని చేసే సాఫ్ట్వేర్ఉద్యోగులు దాదాపు 7.5లక్షల మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. వారి ఓటు ఇక్కడ ఉండదు.
ALSO READ : లీడర్లు నచ్చట్లేదు.. నోటాకు వేస్తం!.. యూత్ ఒపీనియన్
మిగిలిన 3 లక్షల మంది సిటీలోనే పుట్టి పెరిగి, ఇక్కడే తమ ఓటు హక్కు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో10శాతం మంది కూడా పోలింగ్సమయంలో ఓటు వేసేందుకు రావడం లేదని తేలింది. మరోవైపు చదువుకున్నవారు, ఉన్నత విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించక పోవడం లేదనే వాదన కూడా ఉంది. దీంతో ఈసారి ఎలాగైనా 50శాతం ఉన్న టెకీలు ఓటు వేసే విధంగా చైతన్యం చేయనుంది. ఇందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి త్వరలోనే సాఫ్ట్వేర్ కంపెనీలు, అనుబంధ సంస్థల్లో అవగాహన కల్పించి, ఓటు విలువను తెలియజేయాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు.