ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం

ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం

 ఓయూ, వెలుగు :  సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రాడ్యుయేట్లను పల్లీ, బఠానీలతో పోల్చి అవమానపరిచారని నిరుద్యోగ జేఏసీ నాయకులు మండిపడ్డారు. కేటీఆర్​వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద కేటీఆర్​దిష్టిబొమ్మను దహనం చేశారు. బేషరతుగా గ్రాడ్యుయేట్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ మాట్లాడుతూ.. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో డిగ్రీలు పూర్తిచేసిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నతస్థాయిలో ఉన్నారన్నారు. వివిధ రంగాల్లో ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. 

అలాంటి గ్రాడ్యుయేట్లను కించపరుస్తూ కేటీఆర్​మాట్లాడడం క్షమించరాని నేరమన్నారు. గ్రాడ్యుయేట్​ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మేధావుల చదువును కించపరచడం కరెక్ట్​కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఓయూలో పట్టభద్రుడేనన్న సంగతి మర్చిపోయి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఎంతో మంది మేధావులను అందించిన ప్రభుత్వ యూనివర్సిటీలను పల్లీ, బఠానీలతో పోల్చడం కేటీఆర్ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అని విమర్శించారు.

బిట్స్ పిలానీలో చదివిన వాళ్లు వ్యాపారస్తులు అవుతారు కానీ, ప్రజా సేవకులు కాలేరని మానవతారాయ్ ఎద్దేవా చేశారు. బిట్స్​పిలానీలో చదివిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డిని ఓడించి ఓయూ, కేయూలో గ్రాడ్యుయేషన్​పూర్తిచేసిన తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓటుతో కేటీఆర్​కు బుద్ధి చెప్పాలన్నారు. నిరసనలో జేఏసీ నాయకులు పట్ల నాగరాజు, మణికంఠ, అశోక్, అరుణ్, హేమంత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.