- బోథ్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
బోథ్, వెలుగు : నిర్మల్ జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్లో భోజనం చేసి ఫుడ్ పాయిజన్‌కు గురైన యువతి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. బోథ్ ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం పొచ్చర సెయింట్ థామస్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ స్మిత, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ దీపక్, టీచర్లు సిస్టర్ సోఫీ, సిస్టర్ సిజితో పాటు వంట గది ఉద్యోగిని ఫూల్ఖలీ బైగా(19) ఈ నెల 2న నిర్మల్ పట్టణానికి షాపింగ్ కోసం వెళ్లారు. అక్కడ సాయంత్రం ఎన్రెడ్డి కాలనీలోని ఎంబీ యాదవ్ కాంప్లెక్స్‌లో ఉన్న గ్రిల్ నైన్ మల్టీ కుసైన్ రెస్టారెంట్లో భోజనం చేసి తిరిగి రాత్రి స్కూల్‌కు వచ్చారు.
అదేరోజు రాత్రి వారందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చికిత్సు చేయించుకున్నారు. కాగా, ఫూల్ ఖలీ బైగా మాత్రం తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం ఉదయం చనిపోయింది. మృతురాలిది మధ్యప్రదేశ్ కాగా.. ఆమె పాఠశాల సిబ్బందికి వంట మనిషిగా పని చేయడానికి ఇక్కడకు వచ్చింది. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన గ్రిల్ నైన్ మల్టీ కుసైన్ రెస్టారెంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.