సూర్యాపేట అవినీతిపై విచారణ జరపాలి

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్  డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  2014 నుంచి 2023 వరకు మున్సిపాలిటీ పరిధిలో  చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందన్నారు. గత పాలకులు, అధికారులు కాట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి నాణ్యత లేకుండా పనులు చేశారని ఆరోపించారు.   జిల్లా కోర్టు, సంతోష్ బాబు చౌరస్తా వద్ద రోడ్డుపై గంతలు పడడం, కూరగాయల మార్కెట్‌లో సీసీ రోడ్డు కంకర తేలడం ఇందుకు నిదర్శనం అన్నారు.  

పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, నేతలు పేర్ల నాగయ్య,  రాంజి,  వాజిద్, గులాం హుస్సేన్,  పరుశురామ్, లక్ష్మి, శ్రీదేవి, రాజేశ్వరి, జీబా, ఉపేందర్, చిరంజీవి పాల్గొన్నారు.