సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు

  • కార్మిక సంఘాలకు కేంద్ర కార్మికశాఖ నుంచి పిలుపు

కోల్​బెల్ట్/గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలు కానుంది. సింగరేణిలో మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని గత ఏడాది అక్టోబర్​లో రాష్ట్ర హైకోర్టు సింగరేణి సంస్థ, ఆర్ఎల్సీ, సీఎల్సీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం సెంట్రల్​డిప్యూటీ లేబర్​ కమిషనర్​శ్రీనివాస్​రావు సింగరేణిలో ఎన్నికల నిర్వహణ కోసం చర్చించేందుకు రావాలని  కార్మిక సంఘాలకు ఆహ్వానం పలికారు. ఈ నెల 13న హైదరాబాద్​లోని ఆర్ఎల్సీ ఆఫీస్​కు అన్ని సంఘాలు  హాజరు కావాలని కోరినట్లు ఏఐటీయూసీ జనరల్​సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. డీఎల్సీ పిలుపుతో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ ఇక  అనివార్యం కానుంది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఏప్రిల్, ​-మేలో ఎన్నికలు జరిగే చాన్స్ ఉందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా ప్రకటిస్తే సింగరేణి ఎన్నికలు ఆ  తర్వాత జరుగుతాయనే వాదన కూడా వినిపిస్తోంది. సింగరేణిలో ఐదేళ్ల క్రితం చివరిసారిగా యాజమాన్యం గుర్తింపు ఎన్నికలు నిర్వహించింది. రెండేళ్లకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉన్నా సింగరేణి యాజమాన్యం ఇంతకాలం కాలయాపన చేస్తూ వస్తోంది. ఇప్పుడు కార్మిక శాఖ కార్మిక సంఘాలను మీటింగ్​కు పిలవడంతో ఎలక్షన్ల నిర్వహణపై కదలిక వచ్చినట్లేనని కార్మికులు భావిస్తున్నారు.  

ఇప్పటికి ఆరుసార్లు.. 

సింగరేణి సంస్థలో ఇప్పటివరకు ఆరుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. 1998లో తొలిసారి ఎన్నికలు నిర్వహించగా ఏఐటీయూసీ గెలిచింది. రెండోసారి 2001లోనూ విజయం సాధించింది. 2003లో ఐఎన్టీయూసీ గెలిచి నాలుగేళ్ల పాటు కొనసాగింది. 2007లో జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలిచింది. 2012లో టీబీజీకేఎస్​ విజయం సాధించి నాలుగేళ్లు కొనసాగింది. 2017అక్టోబర్​ 5న జరిగిన ఆరో దఫా ఎన్నికల్లో రెండోసారి టీబీజీకేఎస్​ గెలిచింది. ఏడోసారి ఎన్నికలు 2019లో జరగాల్సి ఉండగా గుర్తింపు సంఘం ఆమోదపత్రం సుమారు ఆరు నెలల ఆలస్యంగా 2018 ఏప్రిల్​లో ఇచ్చారని, అప్పటి నుంచి రెండేళ్ల కాలపరిమితి లెక్కించాలని గుర్తింపు కార్మిక సంఘం పట్టుబట్టింది. అనంతరం కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యం లో రెండేళ్లపాటు ఎన్నికలు జరగలేదు. కొవిడ్​-19 తగ్గాక కూడా సింగరేణి ఎన్నికలు నిర్వహించలేదు. 

వ్యతిరేకతకు భయపడి..

సింగరేణిలో 43 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో 11 ఏరియాల వారీగా విస్తరించి ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై బీఆర్ఎస్​ సర్కారు​ఆచితూచి వ్యవహరిస్తోంది. టీబీజీకేఎస్​ యూనియన్ పనితీరుపై అధికార పార్టీ చేపట్టిన ఇంటర్నల్​సర్వేలో యూనియన్​ పట్ల కార్మికుల్లో అసంతృప్తి ఉన్నట్లు తేలడంతో సర్కారు​ఇన్నాళ్లుగా ఎన్నికలపై నాన్చుడు ధోరణి అనుసరించింది. సర్కార్​ కనుసన్నల్లో ఉంటున్న సింగరేణి యాజమాన్యం సైతం ఎన్నికల నిర్వహణ వల్ల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందంటూ సాకు చూపుతూ వచ్చింది.  సింగరేణిలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అన్ని కార్మిక సంఘాలు, జేఏసీ ఆందోళనలు చేపట్టాయి. కార్మిక సంఘాల ఒత్తిడితో కేంద్ర కార్మిక శాఖ రంగంలోకి దిగి అన్ని యూనియన్ల సభ్యత్వాలతో పాటు ఎన్నికల ముందు తీసుకోవాల్సిన చర్యలను పర్యవేక్షించింది. సింగరేణి సీఎండీ శ్రీధర్​ 2022 జూన్​ 8న రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లెటర్​ రాశారు. అయితే కొవిడ్​ సాకుతో పాటు, సింగరేణి ఎలక్షన్ల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై చూపితే ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించిన  రాష్ట్ర సర్కార్ ఎన్నికలకు వెనుకంజ వేసింది.ఈ తరుణంలో  సింగరేణిలో గుర్తింపు ఎన్నికల జాప్యంపై సంస్థ సీఎండీ, ఆర్ఎల్సీ, సీఎల్సీలను ప్రతివాదులుగా పేర్కొంటూ ఏఐటీయూసీ యూనియన్ గత ఆగస్టు 4న హైకోర్టును ఆశ్రయించింది. మూడుసార్లు వాదనలు విన్న హైకోర్టు అక్టోబర్ 28న మూడు నెలల్లో సింగరేణి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ సింగరేణిలో ఎన్నికల కోసం రిటర్నింగ్​అధికారిగా డిప్యూటీ చీఫ్​ లేబర్​కమిషనర్(డీఎల్సీ)​ శ్రీనివాస్​రావును నియమించింది. ఈ నెల 13న ఆర్ఎల్సీ ఆఫీస్​లో జరిగే కార్మిక సంఘాల మీటింగ్​లో సింగరేణి ఎలక్షన్లపై పూర్తి స్పష్టత రానుంది.