టెహ్రాన్: తూర్పు ఇరాన్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. దీంతో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది గాయాలపాలయ్యారు. ఇంకో 18 మంది కార్మికులు గని సొరంగంలో చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మీథేన్ గ్యాస్ లీకవడంతోనే పేలుడు జరిగినట్లు నిర్ధారించారు. కేపిటల్ సిటీ టెహ్రాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలోని తబాస్‌లో ఉన్న బొగ్గు గనిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందగానే సిబ్బంది స్పాట్‌కు చేరుకుని రెస్క్యూ చేపట్టారు.
పేలుడు జరిగినప్పుడు గనిలో 70 మందిదాకా పనిచేస్తుండగా, అందులో 32 మంది చనిపోయారు. గాయాలైన 17 మందిని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించాయి. 2,300 అడుగుల లోతు(700 మీటర్లు లోతు) సొరంగాల్లో పనిచేస్తున్న ఇంకో 18 మంది కార్మికులు చిక్కుకుపోయారని, వారిని రెస్క్యూ చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పేలుడు ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ విచారం వ్యక్తం చేస్తూ, దర్యాప్తునకు ఆదేశించారు. టన్నెల్లో చిక్కుకున్నోళ్లను కాపాడేండుకు అన్నిరకాలుగా ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు.