
న్యూఢిల్లీ : భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తనకు విరిగిన సీటు కేటాయించారని.. అందులో కూర్చొనే గంటన్నరపాటు ఇబ్బంది పడుతూ ప్రయాణించానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్ అయ్యారు. టాటాల చేతికి వెళ్లాక బాగుపడుతుందనుకున్నానని.. కానీ, అది అపోహే అయిందన్నారు.
డబ్బు తీసుకొని అసౌకర్యమైన సీటు కేటాయించడం ప్రయాణికులను మోసం చేయడమేనంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు.. శివరాజ్సింగ్తో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను, డీజీసీఏను ఆదేశించినట్టు చెప్పారు. కాగా, దీనిపై క్షమాపణలు తెలిపిన ఎయిర్ ఇండియా, సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని పేర్కొంది.