ఎల్ బీనగర్, వెలుగు : సిటీ శివారులో గంటపాటు ఈదురు గాలుల, ఉరుములు, మెరుపులతో కురిసిన వాన బీభత్సం సృష్టించింది. దీంతో చెట్లు, స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ కొట్టి.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ వెంటనే ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. చెట్లు, కొమ్మలు విరిగడమే కాకుండా విద్యుత్ తీగలు తెగి రోడ్లపై పడ్డాయి. వనస్థలిపురంలో సుష్మా వద్ద మన్సూరాబాద్ వెళ్లే రూట్ లో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో అటు నుంచి వెళ్తున్న యువతి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద ఆంబులెన్స్ పై చెట్టు కొమ్మ, గణేష్ టెంపుల్ వెనక చెట్టు కొమ్మ విరిగి పడ్డాయి. వనస్థలిపురంలోనే ఓ కారుపై గోడ కూలి పడడంతో ధ్వంసమైంది. మన్సూరాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్ లో రోడ్లపై చెట్ల కొమ్మలు పడ్డాయి. మన్సూరాబాద్ లో రెండు చెట్లు కూలడంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గౌరెల్లి, ప్రతాప సింగారం గ్రామాల మధ్య విద్యుత్ స్తంభం కూలి రోడ్డుపై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
రావినారాయణ కాలనీలో సుమారు 500 పేదల గుడిసెలు గాలివానకు కప్పులు ఎగిరిపోయాయి.
ఘట్ కేసర్ లో పరిధిలో..
ఘట్ కేసర్: మండలంలో పలు గ్రామాల్లో ఇంటి పైకప్పులు లేచిపోవటంతో పాటు చెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాలు కూలిపోయాయి. ప్రతాపసింగారంలో 5 ఇండ్ల పై కప్పులు లేచి పోగా గోడలు కూలాయి. మర్పల్లిగూడలో తాటి చెట్టు నేలకొరింది. అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ట్రాన్స్ ఫార్మర్ తో పాటు విద్యుత్ స్తంభాలు, ఘట్ కేసర్ లో విద్యుత్ వైర్లు, హోర్డింగ్ లు కూలాయి.