
కరీంనగర్ జిల్లాలో మహిళపై అడవిపంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. రోజువారీ విధుల్లో భాగంగా స్కూటీపై వెళ్తున్న మహిళను వేగంగా వచ్చి అడవిపంది దాడి చేసింది. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న గాలిపల్లి వనిత అనే మహిళపై అడవిపంది దాడి చేసింది. మండలంలోని జంగంపల్లి కాంప్లెక్స్ స్కూల్ పరిధిలోకమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్న వనిత.. జంగపల్లి నుంచి గన్నేవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మాదాపూర్ సమీపంలో మామిడి తోట నుంచి వేగంగా దూసుకొచ్చిన అడవిపంది వనితపై దాడి చేసింది. ఈదాడిలో వనిత తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం ఆస్పత్రికి తరిలించారు. వనితపై అడవి పంది దాడితో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అడవిపందుల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.