బరితెగించేసిన లోన్యాప్స్.. భార్య ఫొటో మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్కు పంపారు

బరితెగించేసిన లోన్యాప్స్.. భార్య ఫొటో మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్కు  పంపారు

లోన్ యాప్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.లోన్ డబ్బులు రాబట్టుకునే క్రమంలో ఎంతకైనా తెగిస్తున్నారు..యాప్ ద్వారా ఎటువంటి షరతులు లేని రుణాలు అంటూనే.. వారి పర్సనల్ డేటాను చోరీ చేసి దారుణాలకు ఒడిగడుతున్నారు. తీసుకున్న అప్పు తీర్చినా..ఇంకా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు.. లొంగక పోతే వారి పర్సనల్ డేటాతో చట్టవిరుద్దమైన పనులు చేస్తూ.. అప్పు తీసుకున్నవారిని ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నారు..లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఎందరో అమాయకులు ప్రాణాలు  తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో ఓ వ్యక్తి లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు తాళలేక ప్రాణాలు తీసుకున్న ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో లోన్​యాప్​ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ లం నందిగామకు చెందిన మరిగిద్దె వినోద్​కుమార్​(35) కొన్నేండ్ల కింద సిటీకి వచ్చి బోయిన్​పల్లిలో ప్రైవేట్​ జాబ్​ చేస్తున్నాడు. 

భార్య మంజూషదేవి, బాబు అఖిరానందన్ (4), పాప నందన(3)తో కలిసి చింతల్ శ్రీరామనగర్ లో ఉంటున్నాడు. ఇటీవల వినోద్ తండ్రి శంకర్​రావు అనారోగ్యంతో ఉండడంతో దవాఖాన ఖర్చుల కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేశారు. దీనికి తోడు వినోద్ కు మూడు నెలల నుంచి జీతం సక్రమంగా రావడం లేదు. కొద్ది నెలల కింద భార్యకు తెలియకుండానే ఆమె ఫోన్​ నుంచి ఓ లోన్​యాప్​లో రుణం తీసుకున్నాడు. 

ఆ టైంలో భార్య ఫొటోను యాప్​లో అప్​లోడ్​ చేసి తర్వాత యాప్​ డిలీట్ చేశాడు. నెల నెలా వాయిదాలు కడుతూ వస్తున్నాడు. ఇటీవల కొన్ని వాయిదాలు చెల్లించలేదు. ఈ నెల 8న అతడి పెండ్లి రోజు కావడం, వినాయక చవితి ఉండడంతో యూసుఫ్​గూడలోని సోదరుడి ఇంటికి భార్య, ఇద్దరు పిల్లలను పంపించాడు. 
లోన్​యాప్​ నుంచి కాల్స్​ రాగా ఆన్సర్​ చేయలేదు. దీంతో లోన్​యాప్​ నిర్వాహకులు కుటుంబసభ్యులకు కాల్​చేసి రూ.2300 కట్టాలని చెప్పారు. అంతటితో ఆగకుండా అతడి భార్య ఫొటోను మార్ఫింగ్​ చేసి అతడి ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు పంపారు. దీంతో అతడి బావమరిది లోన్​యాప్​ అమౌంట్​చెల్లించాడు. 

అయినా, మొత్తం డబ్బులను కట్టాలని మరోసారి కాల్స్​చేసి వేధిస్తుండడంతో కలత చెందాడు. సోమవారం ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.