జైపూర్: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉపఎన్నిక సందర్భంగా పోలింగ్ జరుగుతుండగా కాంగ్రెస్ మాజీ నేత, స్వతంత్ర అభ్యర్థి ఒకరు.. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఓ ఆఫీసర్ చెంప చెళ్లుమనిపించాడు. డియోలి–ఉనియారా నియోజకవర్గంలోని సంరవత పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రాజస్థాన్‌లో ఖాళీగా ఉన్న డియోలి–ఉనియారాతో పాటు మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు బుధవారం బై పోలింగ్ జరిగింది. డియోలి–-ఉనియారా నియోజకవర్గం నుంచి కాస్టోర్ చంద్ మీనాను కాంగ్రెస్ బరిలోకి దింపగా.. టికెట్ ఆశించి భంగపడ్డ నరేశ్ మీనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బుధవారం ఈ స్థానానికి పోలింగ్ జరుగుతుండగా ఎన్నికల డ్యూటీలో ఉన్న సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) అమిత్ చౌదరిపై నరేశ్ మీనా చేయి చేసుకున్నారు. "ఎస్డీఎం తనకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులతో ఓటు వేయించారు" అంటూ నరేశ్ ఆరోపించారు.