నీట్​పై సుప్రీం జడ్జితో విచారణ చేయించాలి

నీట్​పై సుప్రీం జడ్జితో విచారణ చేయించాలి

నీట్ ఎగ్జామ్​ పేపర్ లీకేజీలు, అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​ చేస్తూ  హైదరాబాద్ లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

హైదరాబాద్, వెలుగు: నీట్ ఎగ్జాం పేపర్ లీకేజీలు, అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు స్పందించాలని, లేకపోతే వారి పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించాయి. మంగళవారం హైదరాబాద్​లోని హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకూ విద్యార్థి, యువజన సంఘాల(ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ యూఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్​యూ, వీజేఎస్, యువజన కాంగ్రెస్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్) ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ఎన్ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్ఎఫ్​ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుశురామ్, ఆజాద్, యువజన సంఘాల నేతలు ఆనగంటి వెంకటేశ్, ధర్మేంద్ర, కేఎస్ ప్రదీప్, మణికంఠరెడ్డి, అరుణ్ మాట్లాడారు. గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో నీట్ పేపర్ ను రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ అమ్ముకున్నారని ఆరోపించారు.

ఎగ్జాం ఆలస్యంగా స్టార్ట్ అయిందన్న కారణంతో కొందరికి గ్రేస్ మార్కులు కలిపారన్నారు. పేపర్ లీకేజీల్లో రాజకీయ నేతలు, బీజేపీ లీడర్లకు చెందిన కన్సల్టెన్సీల పాత్రపైనా దర్యాప్తు జరగాలన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ మౌనం వదిలి మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నేతలు రజినీకాంత్, మమత, అశోక్​ రెడ్డి, లెనిన్, చందనా రెడ్డి, విష్ణు, అభిషేక్, గ్యార నరేష్, సత్య, రఘురామ్ నాయక్, పెద్దింటి రామకృష్ణ, గడ్డం శ్యామ్, ఎండీ జావేద్, శ్రీనివాస్, కిషన్ రమ్య, ప్రణయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.