రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి బుధవారం కరీంనగర్ జిల్లాలో మృతి చెందడం సాహితీప్రియుల్లో విషాదం నెలకొన్నది. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్నా భిన్నం చేసింది. ఎక్కడా చెదరని గుండెనిబ్బరంతో కాళ్లను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత! పోరాటం ముందు ఆరాటం ఎంత! రాజేశ్వరి రాసిన కవితను గమనిస్తే ఆమె అక్షరాల పదును అర్థమవుతుంది. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవితా సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవితా సంకలనానికి జీవితమే కవిత్వం అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలా లోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే కానీ అమె మాత్రం జీవిస్తుంది అనుభవిస్తుంది. అనుభవాల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి బుధవారం మృతి చెందడం సాహితీ లోకంలో తీరని విషాదం మిగిల్చింది. సిరిసిల్ల ప్రాంతం నుంచి వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరాలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు. సాహితీ లోకానికి తీరని లోటు.
- రావుల రాజేశం,
కవి, రచయిత, కరీంనగర్ జిల్లా