మెట్ పల్లి, వెలుగు: ‘మీ నాన్న నీ కోసం గల్ఫ్ వెళ్లి అష్టకష్టాలు పడుతూ నిన్ను ఉన్నత చదువులు చదివించేందుకు రేయింబవళ్లు పని చేస్తున్నాడు.. నువ్వేమో చెడు తిరుగుళ్లు తిరుగుతూ సరిగా చదువుతలేవు.. చెడు దోస్తానా బంద్ చేసి మంచిగా చదువుకో’ అని తల్లి మందలించడంతో పురుగు మందు తాగి ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన లక్కం సాయిలు, గంగలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. తండ్రి సాయిలు గల్ఫ్‌లో ఉండడంతో తల్లి కొడుకుల బాగోగులు చూసుకుంటోంది.
చిన్న కొడుకు లక్కం రాకేశ్(16) ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రాకేశ్ కొన్ని రోజులుగా కాలేజీకి వెళ్లకుండా దోస్తులతో తిరుగుతున్నాడు. గమనించిన తల్లి శనివారం కొడుకును మందలించింది. దీంతో తాను సరిగా చదవలేకపోతున్నానని జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే పురుగు మందు తాగాడు. గమనించిన తల్లి వెంటనే మెట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గొంతు కోసుకొని వ్యక్తి..
పాల్వంచ రూరల్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: పాల్వంచలో ఆదివారం గొంతు కోసుకొని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నట్లు టౌన్ ఎస్ఐ రాఘవయ్య తెలిపారు. పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉంటున్న రామకృష్ణ (36 ) రెండేండ్ల కింద ఫిట్స్ వ్యాధి రావడంతో పాటు మతిస్థిమితం కోల్పోయాడు. ఇంట్లో ఉన్న చాకుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి భూషణం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య సంధ్య ఉన్నారు.