
వయసుతో సంబంధం లేకుండా గుండె పాటుతో అనేకమంది మృత్యువాత పడుతున్నారు. అతి చిన్న వయసులోనే గుండె పోటుతో ఇటీవల కాలంలో చాలా మంది మృతి చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యర్ధి గుండెపోటుతో చనిపోయాడు. పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణం పసుమరుకు చెందిన షేక్ ఫిరోజ్(17) విద్యార్థి అర్ధరాత్రి రెండు 2 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఎప్పటిలానే కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసిన ఫిరోజ్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో కేకలు వినపడడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా, గుండెలో నొప్పి వస్తోందని చెప్పాడు. ఖంగారుపడ్డ తల్లిదండ్రులు హుటాహుటీన అతనిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మరోవైపు అనంతరపురం పట్టణంలో గుండె పోటుతో 19 ఏళ్ల యువకుడు చనిపోయాడు. తనూజ్ నాయక్ అనే విద్యార్థి పీవీకేకే కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్నాడు. కాలేజీ గ్రౌండ్ లో సరదాగా కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని బెంగళూరు ఆస్పత్తికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తనూజ్ మడశికర మండలం అచ్చంపల్లి తండాకు చెందిన యువకుడిగా గుర్తించారు... కాగా, గత కొంత కాలంగా వయసుతో సంబంధం లేకుండా గుండె పాటుతో అనేకమంది మృత్యువాత పడుతున్నారు. సినీ ప్రముఖులు, కొంతమంది వ్యాయామం చేస్తూ మరి కొంతమంది హఠాత్తుగా అతి చిన్న వయసులోనే గుండె పోటుతో మృతి చెందుతున్నారు. దీంతో జనం భయంతో హడలెత్తిపోతున్నారు.