అమ్మ.. నేను సక్సెస్​ కాలేను..బంధువుల వేధింపులే కారణమంటూ సూసైడ్​ నోట్

  • ‘అమ్మ.. నేను సక్సెస్​ కాలేను’
  • బాచుపల్లిలో ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య 
  • ఘటనపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల డిమాండ్​ 

జీడిమెట్ల, వెలుగు : తన మృతికి బంధువులే కారణమంటూ బాచుపల్లిలోని ఓ ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డికి చెందిన రాజు, రాధిక దంపతుల కొడుకు జస్వంత్​గౌడ్​ (17) బాచుపల్లిలోని ఓ కార్పొరేట్​ కాలేజీలో బైపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి తన హాస్టల్​ గదిలో సీలింగ్​ ఫ్యాన్​కు ఉరేసుకుని మృతి చెందాడు. ఘటనా స్థలంలో రెండు పేజీల సూసైడ్ ​నోట్​ను పోలీసులు గుర్తించారు. అందులో ‘‘ అమ్మానాన్న నేను చేసింది తప్పే. నాకు లైఫ్​పై హోప్స్​ లేవు. అమ్మ  నేను ఎందులో కూడా సక్సెస్​ కాలేను. చెల్లిని అమ్మను బాగా చూసుకో నాన్న.

నా చావుకు ప్రధాన కారణం బంధువులు పెంటవ్వ, భారతి, వెంకట్​గౌడ్, భాగ్య, ఎల్లాగౌడ్, రేణుకలే” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంపై పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం ఒత్తిడితో పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారన్నారు. విద్యార్థి సూసైడ్​చేసుకుంటుంటే గుర్తించలేని స్థితిలో సిబ్బంది ఉన్నారని కాలేజీ ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.