- ఇప్పటివరకు ఖాతా తెరవని గులాబీ పార్టీ
- ఉనికి కోసం బీజేపీ పోరాటం
- దేశంలోనే భారీ మెజార్టీ సాధిస్తామంటున్న కాంగ్రెస్
నల్గొండ, వెలుగు : నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా మూడు ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతంలో బద్దం నర్సింహారెడ్డి, బీమిరెడ్డి నర్సింహారెడ్డి, సూదిని జైపాల్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి హేమాహేమీలు ఎంపీలుగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు.
వారి తర్వాత ఇప్పుడు ‘కొత్త’ సమరం కొనసాగబోతోంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ లీడర్ జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ తరఫున హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు. ఇప్పటికే నామినేషన్లు వేసిన వీరు ఒక దఫా ఎన్నికల ప్రచారం కూడా పూర్తి చేసి రెండో దశ క్యాంపెయిన్‌కు సిద్ధమవుతున్నారు.
భారీ మెజార్టీ పైనే ‘కెప్టెన్’ గురి...
నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల ఇన్చార్జీ అయిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీ పైనే ఫోకస్ పెట్టారు. దేశంలోనే పార్టీ సభ్యత్వంలో నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అదే ఊపుతో ఎంపీ ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయం సాధించిపెట్టడానికి స్థానిక లీడర్లు కష్టపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట మినహా, మిగిలిన ఆరు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో గెలుపు పెద్ద కష్టం కాదని, భారీ మెజార్టీపైనే దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కనీసం 25వేలకు మించి మెజార్టీ సాధించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోనే 70వేలకు పైగా మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు.
మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో 25 వేల మెజార్టీ సాధిస్తామని అంటున్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్...కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండల్లో భారీ సభలను తలపించే విధంగా మీటింగ్స్ పెట్టారు. జానారెడ్డి తన కొడుకు గెలుపు కోసం అంతే స్థాయిలో శ్రమిస్తున్నారు. అంతర్గతంగా అన్ని పార్టీల లీడర్లతో చర్చలు జరిపినట్టు సమాచారం. నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్‌లో చేరడంతో హస్తం పార్టీ మరింత బలపడింది. బీఆర్ఎస్ హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్టయ్యింది. ఇక కోదాడలో కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకతే బీఆర్ఎస్ అస్త్రం...
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని బీఆర్ఎస్ప్రచారం చేస్తూ ఓట్లు కొల్లగొట్టాలని ప్లాన్చేస్తోంది. ముఖ్యంగా కృష్ణాజలాలను కేఆర్ఎంబీకి అప్పగించారని, తాగు, సాగునీటి విడుదల విషయంలో మంత్రులు కనీసం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైపు వెళ్లలేదని, కరువు పరిస్థితులకు ఈ ప్రభుత్వమే కారణమని చెప్తూ ప్రజల్లోకి వెళ్తోంది. అయితే, నల్గొండలో ఇప్పటివరకు బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. అధికారంలో ఉండి.. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది. అదీగాక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సూర్యాపేట మినహా మిగతా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులంతా ఘోరంగా ఓడిపోయారు.
ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డిని బరిలోకి దింపారు. ఆయన జిల్లా రాజకీయాలకు కొత్త కావడం, పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. పైగా, ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లతో సహా సర్పంచులు, ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో పార్టీ లీడర్లను కాపాడుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికే ఎన్నికల ఇన్ చార్జి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది. గెలుపోటముల సంగతి పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ పెంచుకోవాలనే దానిపైనే బీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కేసీఆర్ మూడు సార్లు నల్గొండ, భువనగిరిలో కరువు యాత్ర, కేఆర్ఎంబీ, రోడ్డు షోలు నిర్వహించారు.
మోదీ చరిష్మా, రామ మందిరంపైనే బీజేపీ ఆశలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోని బీజేపీ ఈసారి రామమందిరం, మోదీ ఛరిష్మాపైనే ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ బలహీనపడడంతో ఆ ఓట్లు తమకు వస్తాయని భావిస్తోంది. అయితే, పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డితో కలిసి పని చేయడానికి జిల్లా సీనియర్లు ఇష్టపడడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజూర్‌నగర్‌లో బీజేపీ లీడర్లపై అక్రమ కేసులు పెట్టించారని, అప్పటి స్టేట్ చీఫ్ బండి సంజయ్ పైనా దాడులకు పాల్పడ్డారని గుర్రుగా ఉన్నారు. దీంతో నియోజకవర్గాల్లో సైదిరెడ్డి ఒంటరిగానే పర్యటించాల్సి వస్తున్నది.
ఇంటింటి ప్రచారం, బూత్ లెవెల్ కమిటీలకు బాధ్యతలు అప్పగించినా ఆశించిన స్థాయిలో ప్రచారం సాగడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే నల్గొండలో పార్టీ ప్రచారం గురించి అధిష్టానం ఆరా తీస్తున్నట్టు సమాచారం. అంతేగాక ఎన్నికల ఫండ్ కింద పంపించిన రూ. రెండున్నర కోట్ల లెక్కలపైనా ఎంక్వైరీ చేయిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు సైదిరెడ్డిని మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. చివరి నిమిషం వరకు ఎలాంటి పరిణామమైనా చోటుచేసుకోవచ్చే అభిప్రాయం పార్టీ కేడర్‌లో కనిపిస్తోంది.
లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల వివరాలు
అసెంబ్లీ నియోజకవర్గం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
నల్గగొండ 1,21,079 1,27,766 56 2,48,901
సూర్యాపేట 1,18,770 1,24,893 13 2,43,676
మిర్యాలగూడ 1,15,543 1,20,299 26 2,35,868
హుజూర్నగర్ 1,21,667 1,29,164 17 2,50,848
దేవరకొండ 1,31,659 1,30,392 18 2,62,069
కోదాడ 1,19,068 1,25,878 18 2,44,964
నాగార్జున సాగర్ 1,15,710 1,20,464 21 2,36,195
మొత్తం 8,43,496 8,78,856 169 17,22,521