- ఇద్దరు చిన్నారులతో సహా పది మంది దుర్మరణం
- ఇండస్ట్రియల్ ఏరియాపై దాడి చేశారన్న హెజ్బొల్లా
- మిలిటెంట్ల ఆయుధాగారంపైనే అటాక్ చేశామన్న ఇజ్రాయెల్
బీరుట్: లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ బలగాలకు మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం దక్షిణ లెబనాన్ లోని నబతియే ప్రావిన్స్ వదీ అల్ కఫోర్ ఇండస్ట్రియల్ ఏరియాపై ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్ లో 10 మంది పౌరులు చనిపోయారు. మృతుల్లో ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడిలో ఐదుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.
హెజ్బొల్లా ఆయుధాగారాన్ని లక్ష్యంగా చేసుకునే తాము ఈ దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అయితే, అక్కడ హెజ్బొల్లాకు చెందిన ఎలాంటి ఆయుధాలు లేవని మృతుల కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. అది ఇండస్ట్రియల్ ఏరియా అని, అక్కడ సాధారణ ప్రజలు మాత్రమే ఉన్నారని తెలిపారు. కాగా, నార్త్ ఇజ్రాయెల్ లోని అయిలెట్ హషహర్ ప్రాంతంపైకి రాకెట్లు ప్రయోగించామని హెజ్బొల్లా ప్రకటించింది.
లెబనాన్ లో 600కు పెరిగిన మృతులు..
గాజాలోని హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచీ లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపు కూడా పాలస్తీనాకు మద్దతుగా దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ కూడా లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై అటాక్స్ చేస్తోంది. నిరుడు అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లాకు చెందిన 500 మంది మిలిటెంట్లు, 100 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్ దాడుల్లో ఇక్కడ మృతిచెందిన వారి సంఖ్య 600కు పెరిగింది.